Lady Gold Theft in Hyderabad :సాధారణంగా పెద్దపెద్ద బంగారు ఆభరణాల దుకాణాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఐతే, ఆమె చోరీ చేసిందంటే యజమానికే కాదు ఎవ్వరికీ అనుమానం రాదు. మెరుపు వేగంతో నగలు మార్చేస్తుంది. సీసీటీవీ నిఘా ఉన్నా ఆ నిందితురాలిని గుర్తించేందుకు నెలల సమయం పట్టిందంటే ఆమె హస్తలాఘవం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితురాలు హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసులకు చిక్కింది. ఆమె నుంచి రూ.12లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.
అర్ధరాత్రి దొంగల హల్‌చల్ - పలు దుకాణాల్లో నగదుతో పాటు సరుకులు చోరీ
ఇక్కడ కనిపిస్తున్న మహిళను చూస్తే నగల దుకాణంలో బంగారం కొనేందుకు వచ్చిందని అనుకుంటే పొరబడినట్లే. జడ్చర్లకు చెందిన గౌతమి, భర్తతో కలిసి కర్మన్‌ఘాట్ భూపేశ్ గుప్తానగర్‌లో ఉంటోంది. భర్త సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తుండగా, ఆమె బంగారు ఆభరణాల దుకాణాల్లో చోరీలు చేస్తోంది. దుకాణం సిబ్బంది బంగారు నగలు చూపించమని అడుగుతుంది. వారు పక్కకు చూసిన సమయంలో అసలైన వాటి స్థానంలో నకిలీవి పెట్టి చోరీ చేస్తోంది. డిసెంబర్ 31న కమలానగర్‌లోని లలితా జ్యూవెల్లర్స్‌లో 24గ్రాములు గొలుసు దొంగిలించింది. కాసేపటికి నకిలీ చైన్‌ను గుర్తించి ఫిర్యాదు చేయగా గౌతమిని పోలీసులు పట్టుకున్నారు.
"తనని అదుపులోకి తీసుకున్నాక సరూర్‌నగర్‌లో కాకుండా తనపై ఇంకా 5కేసులు నమోదయ్యాయని తెలిసింది. వాటన్నింటిని పరిగణలోనకి తీసుకొని అరెస్టు చేశాం. కోర్టులో హాజరు పరుస్తాం. అయిదు కేసుల్లో కలిపి మొత్తం పన్నెండు లక్షల విలువైన బంగారం ఆమె దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాం." - సాయిశ్రీ, డీసీపీ ఎల్బీ నగర్