తెలంగాణ

telangana

ETV Bharat / state

KRMB Meeting Today : నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం

KRMB Meeting Today: నేడు మరోసారి కేఆర్‌ఎంబీ జలాశయ పర్యవేక్షక కమిటీ భేటీ కానుంది. ఈ భేటీకి రెండురాష్ట్రాల అధికారుల హాజరుపై అనుమానం నెలకొంది. ముందుగా ఖరారైన సమావేశం ఉన్నందున హాజరుకాలేమని ఏపీ అధికారులు తెలిపారు. తమ అభిప్రాయాలను నివేదికలో పొందుపర్చట్లేదని తెలంగాణ అధికారులు అసంతృప్తితో ఉన్నారు.

KRMB Meeting Today
KRMB Meeting Today

By

Published : Oct 17, 2022, 6:50 AM IST

KRMB Meeting Today: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ ఇవాళ మరోమారు సమావేశం కానుంది. అయితే రెండు రాష్ట్రాల అధికారుల హాజరు మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. శ్రీశైలం, నాగార్జునసాగర్​లో జలవిద్యుత్ ఉత్పత్తి కోసం మార్గదర్శకాలు, వరదజలాల లెక్కలు, రూల్ కర్వ్స్​కు సంబంధించిన నివేదికను ఖరారు చేసి సంతకాలు చేసేందుకు గతంలోనే ఆర్ఎంసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అయితే వివిధ కారణాల రీత్యా సమావేశం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఆర్ఎంసీ ఐదో సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. కేఆర్ఎంబీ సభ్యుడు రవి కుమార్ పిళ్ళై కన్వీనర్​గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ముందుగానే ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున తమకు వీలు కాదని.. మరోరోజు సమావేశం నిర్వహించాలని ఏపీ అధికారులు ఇప్పటికే బోర్డుకు లేఖ రాశారు.

అటు తెలంగాణ అధికారులు కూడా ఆర్ఎంసీ సమావేశంపై అసంతృప్తిగా ఉన్నారు. తమ అభిప్రాయాలను పొందుపరచడం లేదని.. తాము అడిగిన సమాచారం ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్ఎంసీ సమావేశంలో పాల్గొనడం వల్ల ఏం ఫలితం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. తమ అభిప్రాయాలను నివేదికలో పొందుపర్చడంతో పాటు కోరిన సమాచారం ఇచ్చిన తర్వాతే సమావేశం నిర్వహించాలని ఇప్పటికే లేఖ కూడా రాశారు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల అధికారుల హాజరు అనుమానాస్పదంగానే ఉంది. కమిటీ కన్వీనర్ రవికుమార్ పిళ్ళై మాత్రం సమావేశం ఉంటుందని హాజరు కావాలని రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు.

ABOUT THE AUTHOR

...view details