Kishan Reddy focus on Parliament Elections in Telangana : తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముందని, సర్వే సంస్థలకు అందని విధంగా లోక్‌సభ ఫలితాలుంటాయని బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్తో సమాన పోరాటం ఉంటుందని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంచార్జిలు, పార్లమెంటరీ ఇంచార్జీలతో కిషన్‌రెడ్డి(kishan reddy) సమావేశం అయ్యారు. అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వలాభం లేకుండా ఏ నిర్ణయం తీసుకోదు : కిషన్‌రెడ్డి
పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ శ్రేణులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన ఆయన ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని నాయకులకు పిలుపునిచ్చారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారని స్పష్టం చేశారు. డిసెంబర్ చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నట్లు తెలిపారు.
"రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి. లోకసభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవు. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది. సర్వే సంస్థలకు అందని విధంగా లోక్‌సభ ఫలితాలుంటాయి". - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు