Kadiyam Srihari on BJP: భాజపా నేతలపై మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విరుచుకుపడ్డారు. రాజ్యాంగం విషయంలో సీఎం తప్పు మాట్లాడినట్లు విమర్శిస్తున్నారని.. కానీ దేశం అభివృద్ధి చెందాలంటే రాజ్యాంగాన్ని మళ్లీ రచించుకోవాలన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి అనేక సవరణలు జరిగాయన్నారు. దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగానికి సవరణలు చేశారని ఆయన గుర్తు చేశారు. అంబేడ్కర్ నిజమైన వారసులం తామేనన్న కడియం శ్రీహరి.. విమర్శలు చేసే భాజపా నేతలు గాడ్సే వారసులని ఆరోపించారు. అంబేడ్కర్ పేరు ఎత్తేందుకు కూడా వారు అర్హులు కాదన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తి, ఆశయాలను భాజపా ముందుకు తీసుకెళ్లలేదని ఆరోపించారు. రాజ్యాంగానికి అడుగడుగునా తూట్లు పొడిచారని మండిపడ్డారు. దేశ సంపద లూటీ చేసిన వాళ్లకు దోచి పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
దేశంలో అసమానతలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. దేశంలో ఎస్సీ జనాభా 19, ఎస్టీ జనాభా 9 శాతం ఉందన్న ఆయన.. కేంద్ర బడ్జెట్‌లో ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. దళితుల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో దళితబంధు కోసం తెలంగాణ సర్కారు రూ.25 వేల కోట్లు పెట్టబోతోందని తెలిపారు. ఎస్సీలు, ఎస్టీలకు బడ్జెట్‌లో రూ.35 వేల కోట్లు పెట్టబోతున్నామన్నారు. విభజన హామీలను కూడా భాజపా ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పారా అంటూ భాజపా నేతలను కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఎస్సీలు, ఎస్టీల జనాభా ఆధారంగా బడ్జెట్ను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.