Jubileehills gang rape case: జూబ్లీహిల్స్లో సామూహిక లైంగిక దాడికి గురైన బాలిక ఇప్పటికీ ముభావంగానే ఉంటోంది. భయంభయంగా స్పందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై 'ఈనాడు-ఈటీవీ భారత్' ఆరా తీయగా పలు విషయాలు తెలిశాయి. వీడ్కోలు పార్టీకి వెళ్లేందుకు ముందు రోజే బాలిక తల్లిదండ్రుల అనుమతి తీసుకుంది. ఉదయాన్నే స్నేహితురాలితో కలసి బయటకు వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకూ మిత్రుల మధ్య సరదాగా గడిపింది. 5.30 గంటలకు ఇంటికి తిరిగి రావాల్సిన ఆమె ఆలస్యంగా చేరుకుంది.
ఎంతో సంతోషంగా వెళ్లిన ఆమె.. తిరిగొచ్చాక మౌనంగా ఉండిపోయింది. ఎప్పుడూ గలగలా మాట్లాడే బిడ్డ.. నిశ్శబ్దంగా ఉండటాన్ని కన్నపేగు పసిగట్టింది. తొలుత పార్టీలో డ్యాన్స్, ప్రయాణ బడలిక కారణం కావచ్చనుకుంది. అయినా అమ్మ మనసు ఎందుకో కీడు శంకించింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. బిడ్డ నుంచి ముభావంగా సమాధానాలు రావటంతో తన ఆందోళన నిజమని నిర్ధారించుకుంది. వాస్తవం ఏమిటో చెప్పకపోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతోందనే ఉద్దేశంతో నగరంలోని ఓ మనస్తత్వ నిపుణుడి వద్దకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అక్కడా అదే పరిస్థితి. వారిచ్చిన సూచనతో భరోసా కేంద్రానికి వెళ్లారు.
అక్కడ కౌన్సెలర్లు బాలికను ప్రేమగా పలకరించి విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. షాక్‌లో ఉన్న ఆమె మాట్లాడలేకపోతోంది. ఆమెతో అసలు విషయం చెప్పించేందుకు కౌన్సెలర్లు ఓపికతో ప్రయత్నించారు. చివరకు ఆమె కన్నీరు తుడుచుకుంటూ మూడ్రోజుల నుంచి తాను అనుభవించిన నరకాన్ని వారితో పంచుకుంది. స్నేహితులని నమ్మి వెళ్తే తనపట్ల ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తించారో వివరించింది. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో సామూహిక లైంగిక దాడికి గురైనట్టు గుర్తించారు. శరీరంపై గాయాలు చూసిన కన్నతల్లి కన్నీరుమున్నీరైనట్లు సమాచారం. నిందితులకు శిక్ష పడాలని ఆ తల్లి వేడుకున్నట్టు తెలిసింది. కుమార్తె ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.