AP HIGH COURT GO No 1 PIL : ‘రహదారులపై నిర్వహించే ప్రతి కార్యక్రమాన్నీ నిషేధించాలని మీరు చెప్పలేరు’ అని పిటిషనర్‌ను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. రహదారులపై రాజకీయ సమావేశాలు, రోడ్ షోలకు అనుమతి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీలను ఆదేశించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడుకు చెందిన బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో పిల్ వేశారు. కందుకూరు, గుంటూరులలో తొక్కిసలాట ఘటనలపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు.
దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. సమావేశాలు, రోడ్ షోలను నియంత్రించేందుకు, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
నేడు సుప్రీంకోర్టులో విచారణ!:రహదారులపై సభలు, సమావేశాల నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 1ను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంలో విచారణకు వచ్చే అవకాశముంది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది మహ్‌ఫూజ్ నజ్కీ బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఎదుట ప్రస్తావించారు. స్పందించిన సీజేఐ పిటిషన్‌ను గురువారం నాటి విచారణ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు.