Heavy rains and floods in TS: రాష్ట్రంలో గత మూడు దశాబ్దాలుగా వర్షపాతం క్రమంగా పెరుగుతోంది. ఈశాన్య రుతుపవనాల్లో పెద్దగా మార్పులు లేకున్నా.. ‘నైరుతి’లో వర్షపాతం పెరుగుతోంది. ఇందులోనూ జూన్, జులై, ఆగస్టు నెలల వర్షపాతంలో పెద్దగా మార్పు లేదు. సెప్టెంబరులో మాత్రం ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. 1951 నుంచి 2021 వరకు విశ్లేషించగా.. 17 ఏళ్లు అధిక వర్షపాతం నమోదైంది. 36 ఏళ్లు సాధారణ వర్షపాతం, 18 ఏళ్లు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. 1951 నుంచి 1989 వరకు వర్షపాతంలో చెప్పుకోదగిన మార్పులు లేవు. 1990 నుంచి 2022 వరకు కొంత మార్పులు చోటుచేసుకున్నాయి. గత ఏడాది, అంతకు ముందు సంవత్సరం రాష్ట్రంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షం కురవడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర సాధారణ వర్షపాతం 906 మిల్లీమీటర్లు కావడం గమనార్హం. రాష్ట్రంలో 70 ఏళ్ల వాతావరణ పరిస్థితులను రాష్ట్ర ప్రణాళికాశాఖకు చెందిన రాష్ట్ర విపత్తు ప్రణాళిక, నిర్వహణ సొసైటీ(టీఎస్‌డీపీఎస్) విశ్లేషించింది. 1951 నుంచి ఈ ఏడాది జులై 14వ తేదీ వరకు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై సమగ్ర సంకలనాన్ని రూపొందించింది.
జీహెచ్‌ఎంసీలో పెరుగుదల:కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో గత 32 ఏళ్లలో వర్షపాతం స్వల్పంగా పెరిగింది. 2004-05 నుంచి 2019-20 వరకు విశ్లేషించగా.. నైరుతి రుతుపవనాలతో పాటు వార్షిక వర్షపాతం హైదరాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పెరుగుతుండగా.. నిర్మల్, మంచిర్యాల, మెదక్, సూర్యాపేట జిల్లాల్లో తగ్గుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 85 నుంచి 110 మిల్లీమీటర్ల మేరకు పెరుగుదల ఉంది. జీహెచ్‌ఎంసీలోనూ మధ్య, తూర్పు మండలాల్లో పెరుగుదల ఉండగా.. పటాన్‌చెరు, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్, ఆల్వాల్, మల్కాజిగిరి మండలాల్లో తగ్గుదల ఉంది.