గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ (Chairman Chandrasekhar Iyer) ప్రాజెక్టుల పరిశీలన కోసం నేడు, రేపు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. బోర్డు సభ్యుడు కుటియాల్, ఇంజినీర్లతో కలిసి ఆయన పర్యటిస్తారు. ఇవాళ సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టు (Nijansagar projects), అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలను పరిశీలిస్తారు. రేపు ఎస్సారెస్పీ (srsp), చౌటుపల్లి హన్మంతురెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తారు.
రేపు ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లతో చంద్రశేఖర్ అయ్యర్... ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్ద సమావేశం అవుతారు. కేంద్రం ఇటీవల ఖరారు చేసిన పరిధికి అనుగుణంగా ప్రాజెక్టులను నదీ యాజమాన్య బోర్డులకు స్వాధీనం చేయాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది. పర్యటన అనంతరం ప్రాజెక్టుల స్వాధీనం విషయమై బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఈనెల 17న జీఆర్‌ఎంబీ సమావేశం
కేంద్ర గెజిట్ అమలుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) ప్రక్రియను వేగవంతం చేసింది. ఈనెల 17న ఐదో దఫా ఉపసంఘం సమావేశాన్ని (GRMB Subcommittee Meeting) ఏర్పాటు చేసింది. గెజిట్ షెడ్యూల్-2లో పేర్కొన్న ప్రాజెక్టులపై చర్చించేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన సభ్యులతో హైదరాబాద్‌లోని జలసౌధలో గెజిట్ అమలుపై ఉ.11 గంటలకు ఉపసంఘం (GRMB Subcommittee Meeting) భేటీ కానుంది. రెండు రాష్ట్రాలకు చెందిన నాలుగు కంపోనెంట్లను బోర్డుకు అప్పగించడంలో భాగంగా తుది నిర్ణయం తీసుకునేందుకు ఎజెండా రూపొందించారు.
కంపోనెంట్లు ఇవీ..
- తెలంగాణ పరిధిలోని జె.చొక్కారావు ఎత్తిపోతల పథకంలోని గంగారం పంపుహౌస్, శ్రీరామసాగర్ ప్రాజెక్టు (ఒకటో దశ) కింద గీసుకొండ సమీపంలో కాకతీయ కాల్వపై ఉన్న క్రాస్ రెగ్యులేటర్
- ఆంధ్రప్రదేశ్ పరిధిలో తొర్రిగెడ్డ ఎత్తిపోతల పంపుహౌస్, చంగలనాయుడు ఎత్తిపోతల పంపుహౌస్
ఇదీ చూడండి:NWDA Meeting: 'గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్లను త్వరగా ఆమోదించాలి'