గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్రంపై తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే గవర్నర్.. వరదల కారణంగా ప్రజలకు వచ్చే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. రాజ్‌భవన్ నుంచి నేరుగా ప్రజలతో ఫోన్లో మాట్లాడారు. సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు జరిగిన ఈ టెలీ మెడిసిన్ కార్యక్రమంలో భాగంగా 21 మంది కాలర్స్‌తో సంభాషించారు. రాజ్‌భవన్ వైద్యులు డాక్టర్ దినేష్, డాక్టర్ నాగమణిలు గవర్నర్‌కు సహకారం అందించారు.
ఈ టెలీ మెడిసిన్ కార్యక్రమంలో భాగంగా సాధారణ జలుబు నుంచి మొదలుకొని ఇన్ఫర్టిలిటీ, కిడ్నీ ఫెయిల్యూర్ వరకు అనేక సమస్యలను ప్రజలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆరోగ్యం పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలను గవర్నర్ నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన భర్త రెండు కిడ్నీలు పాడైపోయాయని.. సాయం చేయాలని కోరగా.. వెంటనే స్పందించిన గవర్నర్ సమస్యను వివరిస్తూ ఓ లేఖ పంపాలని సూచించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.