అత్యవసర పని ఉన్నా కరోనా నేపథ్యంలో కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే పౌర సేవలు, ఫిర్యాదుల స్వీకరణ నిలిపేశారు. కొన్ని సేవలను పరిమితంగా తక్కువ మందితో కొనసాగిస్తున్నారు. ఎక్కువ శాతం సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. అధికారులతో సమావేశాల వర్చువల్ పద్ధతిలో పూర్తి చేస్తున్నారు. తక్కువ మందితో మాత్రమే కలుస్తున్నారు.
కార్యాలయాలకు వెళ్లకపోవడమే మేలు
గతంలో గ్రేటర్‌లో అన్ని రవాణా శాఖ కార్యాలయాలు వాహనదారులతో కిక్కిరిసి ఉండేవి. ఎల్‌ఎల్‌ఆర్‌లు, లైసెన్సుల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్లు ఇబ్బడిముబ్బడిగా సాగేవి. కొవిడ్ ప్రభావంతో సేవలను పరిమితం చేశారు. తక్కువ సంఖ్యలోనే స్లాట్‌లను కేటాయిస్తున్నారు. వాహనదారులను పరిశీలించి లోపలికి పంపుతున్నారు.
జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు, జలమండలి, హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్లలో ఫిర్యాదుల స్వీకరణ, నేరుగా ప్రజలను కలవడం తగ్గించేశారు. ఇప్పటికే ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రజలను అనుమతించడం వల్ల ముప్పును కొనితెచ్చుకున్నట్లే. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. సాంకేతిక మార్గాల ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
అదెలాగంటే..
- జీహెచ్‌ఎంసీ: ప్రజావాణి నిలిపేశారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో గూగుల్ మీట్ లింకు ద్వారా రోజు సాయంత్రం 4-5 గంటల మధ్య కమిషనర్‌ను లేదా ఇతర ఉన్నతాధికారులను సంప్రదించవచ్ఛు. జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్ 040-21111111కు ఫోన్ చేసి ఇబ్బందులు చెప్పుకోవచ్ఛు రోడ్లు, కుక్కలు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు సమస్యలపై మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు.
- జలమండలి:గతంలో నల్లాదారుల సమస్యలు ఎండీ దృష్టికి తెచ్చేందుకు ప్రతి శనివారం నిర్వహించే మీట్ యువర్ ఎండీ, డయల్ యువర్ ఎండీ నిలిపేశారు. సమస్యలపై 040-23442881, 23442882, 23442883 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్ఛు. నీటి సరఫరా, బిల్లుల్లో తేడాలు, కొత్త కనెక్షన్ల జారీ ఇతరత్రా ఫిర్యాదులను సైతం కస్టమర్ కేంద్రం 155313కు ఫోన్ చేసి వివరించవచ్ఛు సిటిజన్ సర్వీస్ యాప్‌తోపాటు జలమండలి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లోనూ సమస్యలు ప్రస్తావించవచ్చు.
- విద్యుత్తు:వర్షాకాలం విద్యుత్తు సమస్యలు తలెత్తుతున్నాయి. బిల్లుల్లో తేడాలపై జనం గగ్గోలు పెట్టారు. కార్యాలయాలకు వెళ్లకుండానే, 1912లో సంప్రదించొచ్ఛు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కార్పొరేట్ పేరుతో ట్విట్టర్‌లోనూ సమస్యలను ప్రస్తావించొచ్చు.
- పోలీసులు:ప్రతి సమస్యకు పోలీసుస్టేషన్‌ను సంప్రదించే అవసరం లేకుండా 100కు ఫోన్ చేస్తే...పోలీసులే ఘటనా స్థలానికి చేరుకుంటారు. మహిళలు, చిన్న పిల్లల వేధింపులకు సంబంధించి 100తో పాటు 040-27852500(భరోసా కేంద్రం), 9490616555(హైదరాబాద్ పోలీసు కమిషనర్ వాట్సాప్) నంబర్లలోనూ ఫిర్యాదు చేయొచ్చు.
- కలెక్టరేట్లు:ప్రతి సమస్యకు కలెక్టరేట్ రావాల్సిన అవసరం లేకుండానే తహసీల్దారు కార్యాలయంలో కానీ ఆర్డీవో ఆఫీసులో కానీ వివరిస్తే వారి స్థాయిలో సమస్యలు పరిష్కరించే వీలుంది. అత్యవసరమైతే నే కలెక్టరేట్‌కు రావాలని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: 1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం