కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తుదిశ్వాస విడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ఇవాళ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ ఉదయం పదిన్నర గంటలకు రోశయ్య భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి గాంధీభవన్‌కు తీసుకురానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఆదివారం గాంధీభవన్‌లో రోశయ్యకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు తూంకుంట పురపాలక పరిధి దేవరయాంజల్‌లోని రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. వీటిని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అంత్యక్రియలకు తమ తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరవుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
పార్టీలకతీతంగా నివాళులు
పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ పార్టీల ప్రముఖులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రోశయ్య కుటుంబసభ్యులను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. కుమారులు, కుమార్తెతో మాట్లాడి ఓదార్చారు. రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు.. రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు.