accident at Nallamala forest area: సినిమాల్లో సెంటిమెంట్ సీన్స్ వస్తే కంటతడి పెడతాం. విలన్ ఎవరినో చంపుతుంటే మనం బాధపడిపోతాం. ఆపదల్లో ఉన్న వారిని చూసి అయ్యో అంటాం. మనం చూస్తుంది సినిమానే అని మనకూ తెలిసినా.. కళ్ల ముందు కనిపించే దృశ్యాలకు కరిగిపోతాం. అలాంటిది నిజ జీవితంలో ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో కాపాడమని ఆర్తనాదాలు పెడుతున్నా.. ఒక్కరూ పట్టించుకోలేదు. పక్క నుంచే వెళుతున్నా.. బండి ఆపి కనీసం అండగా నిలవలేదు. పోతూ పోతూ ఏ అంబులెన్స్కో అయినా ఫోన్ చేయలేదు. అప్పటి వరకు తనతో కబుర్లు చెప్పుకుంటూ తన వెనకాలే కూర్చున్న భార్య విగతజీవిగా పడిపోయి ఉన్నా.. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తన కూతురిని కాపాడుకునేందుకు అతడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు ఓ మానవతావాది స్పందించి.. ముగ్గురినీ తన కారులో ఆసుపత్రికి తరలించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నల్లమల అడవిలో జాతీయ రహదారిపై జంబులయ్య కుటుంబంతో బైక్పై వెళ్తుండగా.. వారిని క్రాస్ చేసి ఓ జీపు ముందుకు వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా బస్సు రావడంతో జీప్ డ్రైవర్ ఒక్కసారిగా స్పీడ్ తగ్గించాడు. దీంతో వెనుక వస్తున్న జంబులయ్య బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది.