ఒక్క ఓటమికే కేసీఆర్‌కు దిమ్మ దిరిగిపోయిందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela rajender comments) వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ తీర్పు ఆరంభం మాత్రమేనని... త్వరలో తెలంగాణవ్యాప్తంగా ఇదే తరహా ఫలితాలు పునరావృతమవుతాయని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవారు సీఎం కేసీఆర్‌ను వీడాలని కోరారు. తెరాస ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నానని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా... తెలంగాణ గడ్డపై కమలం పువ్వు వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రమాణానికి ముందు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించిన ఈటల.... ప్రమాణం తర్వాత మళ్లీ గన్‌పార్క్‌కు వెళ్లారు. రానున్న రోజుల్లో రాష్ట్రప్రజలంతా కేసీఆర్‌కు బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఈటల పేర్కొన్నారు.
ఈ గెలుపులో హుజూరాబాద్ ప్రజానీకం వాళ్ల ఆత్మను ఆవిష్కరించే గొప్ప తీర్పునిచ్చారని(Etela rajender comments) కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని నిలిపే తీర్పుగా... యావత్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపే తీర్పుగా భావిస్తున్నానని అన్నారు. గతంలో పనిచేసినట్లే... రాబోయే కాలంలో మచ్చలేకుండా ముందుకు వెళ్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజల గొంతుకనై ఉంటానని స్పష్టం చేశారు.
హుజూరాబాద్ ఫలితం ఆరంభం మాత్రమే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్‌ను సీఎం కేసీఆర్ కాల రాశారు. ధర్నా చౌక్ అవసరం ఏంటో కేసీఆర్‌కు తెలిసొచ్చింది. భాజపా నాయకత్వంలో కేసీఆర్ నియంతృత్వ, అవినీతి పాలనపై పోరాటం చేస్తాను. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎగిరేది కాషాయ జెండా మాత్రమే. ఎనిమిదేళ్లుగా వరి ధాన్యం కొన్నది ఎవరో కేసీఆర్ చెప్పాలి. మిల్లింగ్ టెక్నాలజీని పెంచుకోవటంలో తెరాస ప్రభుత్వం విఫలమైంది. ప్రజల మీద ప్రేముంటే కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలి. కేసీఆర్ గంటలకొద్దీ ప్రెస్ మీట్స్ పెట్టడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ పెద్ద నోరుతో చెప్తున్నా... అబద్దాలు నిజాలు కావు.