BJP Maha Dharna : టీఎస్పీఎస్సీలో కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారంటే ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉందా అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిలదీశారు. బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించినట్లు తెలిపారు. 'ఆనాడు ఏ ఉద్యోగాలొస్తాయని సంబురపడ్డామో.. వాటి సంగతి అటుంచితే ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం ఊడగొడుతోందని' ఆయన మండిపడ్డారు.
ఐటీ, ఫార్మా సహా హైదరాబాద్ కంపెనీలతో పాటు సింగరేణి ద్వారా లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆనాడు చెప్పారని ఈటల పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండొద్దని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ వాటిని రద్దు చేయకపోగా.. ప్రభుత్వ శాఖలన్నింటిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనే నియమించారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులంతా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారనే భయంతోనే ఎన్నికల ఏడాదిలో విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో బిజీగా ఉండాలని వరుస నోటిఫికేషన్లు ప్రకటించారని అన్నారు.
గత నాలుగేళ్లలో 11 వేలకు మించి ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదంటే.. నిరుద్యోగులపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతోందని విమర్శించారు. దిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను కాపాడుకోవడానికి కేసీఆర్ యత్నిస్తున్నారే తప్ప.. నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
"జీహెచ్ఎంసీ ఉద్యోగులు సమ్మె చేస్తే కలం పోటుతో 17 వందల మందిని తీసేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్లను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు. దీంతో 39 మంది కార్మికులు గుండెపోటుతో చనిపోయారు. సింగరేణిలో ఉన్న ఉద్యోగాలను కుదించేశారు. టీఎస్పీఎస్సీ కమిషన్ ఛైర్మన్‌ను నియమించింది కేసీఆర్ కదా..? నమ్ముకున్న వాళ్లను ఎందుకు మోసం చేశారో ఆలోచించండి. 30 లక్షల మంది యువత కన్నీళ్లు పెడుతున్నారు."- ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే
కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. కేసీఆర్ ఈ మధ్య కాంగ్రెస్‌ను బాగా పొగుడుతున్నారని.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అంటున్నారని అన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే.. కాంగ్రెస్‌తో కలిసి బీఆర్ఎస్ ఎంపీలంతా రాజీనామా చేసి సంఘీభావం తెలిపాలని సూచించారు. కేసీఆర్ 9 మంది ఎంపీలతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు.