ED Investigating TSPSC Paper Leak Accused: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను చంచల్‌గూడ జైల్లో తొలిరోజు విచారించింది. ప్రవీణ్, రాజశేఖర్‌లను విచారించడానికి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సాయంత్రం 5 గంటల వరకు వారిని విచారించిన అధికారులు పలు కీలక వివరాలు రాబట్టారు. మనీ లాండరింగ్ కోణంలో వారిని ప్రశ్నించారు. రేపూ నిందితుల వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేయనున్నారు.
మరోవైపు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్‌ఛార్జి శంకరలక్ష్మిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం సుదీర్ఘంగా విచారించారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తొలుత న్యాయస్థానం నుంచి ఈడీ ఎఫ్‌ఐఆర్ తీసుకుంది. ఇందులో భాగంగానే ఆ వివరాల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది.
ఈ క్రమంలోనే మొదట శంకరలక్ష్మితో పాటు లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సత్యనారాయణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బుధ లేదా గురువారాల్లో తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే బుధవారం వీరిద్దరూ విచారణకు గైర్హాజరయ్యారు. గురువారం మాత్రం శంకరలక్ష్మి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తమ కార్యాలయానికి వచ్చిన ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం రాత్రి పొద్దుపోయే వరకు ప్రశ్నించింది.
విశ్వసనీయ సమాచారం మేరకు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ విధివిధానాల గురించి.. ప్రశ్నపత్రాలు ఎలా కొట్టేశారనే విషయాలపై ఈడీ శంకరలక్ష్మిని ప్రశ్నించింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. సత్యనారాయణకు మరోసారి నోటీసు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.