కుంభవృష్టి వల్ల హైదరాబాద్‌లో చాలా ప్రాంతాలు ముంపునకు గురవ్వగా... అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నగరవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో మెుత్తం 19 డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కష్టాల్లో ఉన్నామని ఫోన్ చేసిన బాధితులకు వెంటనే సహాయం అందిస్తున్నాయి. రహదారులపై కూలిపోయిన చెట్ల తొలగింపు... నీటిని మళ్లించే పనులే కాకుండా ఆపదలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నామని డీఆర్ఎఫ్ టీమ్ సభ్యులు తెలిపారు. న్యూనాగోల్లో రహదారులకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను కత్తిరించిన సహాయ బృందాలు.. స్థానికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
నీటిని మళ్లించేందుకు చర్యలు
సరూర్ నగర్లోని సరస్వతి నగర్ , సింగరేణి కాలనీలో రహదారిపై నిలిచిన బురదను... జేసీబీ సహయంతో జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. నీటిని మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. లాలాపేటలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారిపై నిలిచిన చెత్త, చెదారాన్ని తీసివేశారు. ఆ ప్రాంతాల్లో బ్లీచింగ్, రసాయనాలు పిచికారీ చేశారు. మరోవైపు నగరంలో వివిధ చోట్ల శిథిలావస్థకు చేరిన పురాతన భవనాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు నేలమట్టం చేస్తున్నారు. అందులో భాగంగా బేగంబజార్‌లో ఓ పురాతన భవనాన్ని జేసీబీతో కూల్చేశారు.