Dharmapuri Arvind Comments On Revanth Reddy : అమెరికాలోని తానా సభలో రేవంత్ రెడ్డి అవసరమైతే సీతక్కను సీఎం చేస్తానన్న వ్యాఖ్యలపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారమే రేగుతోంది. అప్పుడే ఎన్నికలు వచ్చాయనేంతలా.. నేతల తీరు ఉంది. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హైదరాబాద్‌లో బీజేపీ సమావేశం జరిగిన అనంతరం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు.
సీతక్కను ముఖ్యమంత్రి కాదు.. మొదట సీతక్కను పీసీసీ అధ్యక్షురాలిని చేయగలరా? అంటూ రేవంత్ రెడ్డి ఈ విషయానికి సమాధానం చెప్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. అవసరమైతే కాదు.. సీతక్కను సీఎం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. యూసీసీ బిల్లు ఉభయ సభలో పాస్ అయ్యాక సీఎం కేసీఆర్ పాకిస్థాన్ పోవాస్లిందేనని ఎద్దేవా చేశారు. ముస్లిం ఓట్లు ఎక్కడ కాంగ్రెస్‌కు పడతాయనే భయం కేసీఆర్‌లో మొదలైందని ఆరోపించారు.
"యూసీసీ బిల్లు ఉభయ సభల్లో పాస్ అయ్యాక సీఎం కేసీఆర్ పాకిస్థాన్ పోతే ఎవరూ కాదనరు. ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు వెళతాయనే భయంతో.. ముస్లిం మత పెద్దలను పిలుచుకొని కేసీఆర్ మీటింగ్ పెట్టారు. యూసీసీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకున్నా పాస్ అవుతుంది. రేవంత్ రెడ్డి సీతక్కను సీఎం చేస్తామేమో.. మొదట సీతక్కను పీసీసీ అధ్యక్షురాలిగా చేయండి. ఆ తర్వాత మాట్లాడండి. 24 గంటల విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచిగా సమాధానం చెప్పారు." - ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ