తెలంగాణ

telangana

ETV Bharat / state

సైబర్ నేరగాళ్ల మోసాల పరంపర... స్కాన్​ చేస్తే నగదు మాయం

సైబర్ నేరగాళ్ల మోసాల పరంపర కొనసాగుతూనే ఉంది. వివిధ తరహాలో మోసాలకు పాల్పడుతున్న సైబర్ మోసగాళ్లు... వస్తువుల కొనుగోలు, విక్రయాల పేరుతో అమాయకులను నమ్మించి మోసం చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ పంపి వాటి ద్వారా డబ్బులు లాగేస్తున్నారు. ఈ తరహా మోసాలు గతేడాది నుంచి ఎక్కువ జరుగుతున్నట్లు సైబర్ క్రైం పోలీసుల నివేదికలో తేలింది.

సైబర్ నేరగాళ్ల మోసాల పరంపర... స్కాన్​ చేస్తే నగదు మాయం
సైబర్ నేరగాళ్ల మోసాల పరంపర... స్కాన్​ చేస్తే నగదు మాయం

By

Published : Feb 25, 2021, 9:27 PM IST

ఓఎల్ఎక్స్, లేదా ఇతర వెబ్​సైట్లలో మీరేదైనా వస్తువును కొనుగోలు, లేదా అమ్మాలనుకుంటున్నారా? డబ్బులు చెల్లించడానికి లేదా తీసుకోవడానికి అవతలి వ్యక్తి పంపించిన క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేశారా? అయితే మీ ఖాతాలోని నగదు సైబర్ నేరగాడి ఖాతాలోకి జమ అయినట్లే. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు కొంత కాలంగా క్యూఆర్ కోడ్ మోసాలకు పాల్పడుతున్నారు.

ఇదే తరహా ఫిర్యాదులు...

గతేడాది నుంచి సైబర్ క్రైం పోలీసులకు ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి. ఎవరైనా ఓ వస్తువును విక్రయానికి పెడితే ఆ వస్తువును కొంటామని సైబర్ నేరగాడు సంప్రదిస్తాడు. వస్తువు ధర నిర్ణయించుకున్న తర్వాత డబ్బు చెల్లింపు విషయంలో సైబర్ మోసగాడు చర్చిస్తాడు. డబ్బును వాలెట్ ద్వారా పంపిస్తున్నానని... దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ పంపించానని నమ్మిస్తాడు. అయితే వినియోగదారుడు ఆ క్యూర్ కోడ్​ను స్కాన్ చేయగానే వెంటనే ఖాతాలో నుంచి నగదు మాయమవుతోంది.

స్కాన్​ చేస్తే మాయం...

సైబర్ మోసగాడు పంపించే క్యూర్ కోడ్​లో సెండింగ్​కు బదులు రిసీవింగ్ అనే ఆప్షన్ ఎంపిక చేసి వినియోగదారుడికి పంపిస్తాడు. ఇది అంతగా గమనించని వినియోగదారుడు ఆ క్యూర్ కోడ్​ను స్కాన్ చేయగానే వినియోగదారుడి ఖాతాలో ఉన్న డబ్బు సైబర్ నేరగాడి ఖాతాలోకి వెళ్లిపోతుంది. గతేడాది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే క్యూఆర్ కోడ్ మోసాల వల్ల రూ. కోటి 70 లక్షలు సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

ఆర్మీ, పోలీస్​ అధికారులమంటూ...

సైబర్ నేరగాళ్లు ఓఎల్ఎక్స్, క్వికర్​తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో వస్తువుల విక్రయాలకు, కొనుగోళ్లకు సంబంధించిన సమాచారం ఉంచుతున్నారు. వాటిని చదివి ఎవరైనా వాళ్లను సంప్రదిస్తే అక్కడి నుంచే మోసానికి తెర లేపుతున్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు.. .ఆర్మీ, పోలీస్​, నేవీ అధికారులమంటూ నమ్మిస్తున్నారు. ఆర్మీ దుస్తులను వేసుకొని ఫొటోలు దిగి వాటిని ప్రచారానికి వాడుకుంటున్నారు. ఆర్మీ, నేవీ అధికారులమంటే ప్రజలు వెంటనే నమ్మి బుట్టలో పడిపోతారని సైబర్ నేరగాళ్లు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు.

ఎక్కువగా వాళ్లే...

ఎక్కువగా రాజస్థాన్, ఝార్కండ్, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు చెందిన వాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే క్యూఆర్ కోడ్​లకు అసలే స్పందించొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ క్యూఆర్ కోడ్ ద్వారా లావాదేవీలు నిర్వహించాల్సి వస్తే క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీసులు సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే సందర్భంలో అక్కడ డబ్బులు చెల్లింపు కోసమా? లేకపోతే స్వీకరించడానికే అనే విషయాన్ని గమనించిన తర్వాతే తదుపరి లావాదేవి కొనసాగించాలని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.

సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సైబర్ నేరగాళ్లు చేసే మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నేరగాళ్లను నియంత్రించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి :సాగుచట్టాలతో రైతులకు ఎలాంటి లాభం లేదు: ఆర్​.నారాయణమూర్తి

ABOUT THE AUTHOR

...view details