తెలంగాణ

telangana

By

Published : Jul 13, 2020, 7:09 AM IST

ETV Bharat / state

సైబర్​ నేరాలకు చెక్​.. ఆ ఆన్​లైన్ పోర్టల్​కు నోటీసులు..!

తక్కువ ధరలకే బైకులు, కార్లు అంటూ ఓఎల్​ఎక్స్​లో వస్తోన్న ప్రకటనలు చూసి మోసపోయారా.. అయితే వీటికి సైబర్​ క్రైమ్​ పోలీసులు చెక్​ పెట్టనున్నారు. ఈ సంస్థ వేదికగా అంతర్జాలంతో నేరాలకు పాల్పడుతున్న సైబర్​ నేరస్థులు.. ప్రకటనలు నిలుపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ తాఖీదులు పంపనున్నారు. పరోక్షంగా మీరు వారికి సహకరిస్తున్నారంటూ గతంలో ఓఎల్​ఎక్స్​ ప్రతినిధులను పోలీసులు హెచ్చరించారు. దీనిపై స్పందించకపోయినా, ప్రకటనల విషయంలో మార్పు చేయకపోయినా చట్టపరమైన చర్యలుంటాయంటూ స్పష్టం చేశారు.

cyber crime police notice issued to the olx management about advertisements
సైబర్​ నేరాలకు చెక్​.. ఓఎల్​ఎక్స్​ కంపెనీకి తాఖీదులు

సైబర్‌ నేరస్థులకు సహకరిస్తున్నారంటూ అభియోగాలు

తక్కువ ధరలకే బైకులు, కార్లు అంటూ ఓఎల్‌ఎక్స్‌లో వస్తున్న ప్రకటనలకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అడ్డుకట్ట వేయనున్నారు. సైబర్‌ నేరస్థులు అంతర్జాలంలో ఈ సంస్థ వేదికగా చేస్తున్న ప్రకటనలను నిలపకపోతే చర్యలు తీసుకుంటామంటూ తాఖీదులు పంపనున్నారు. రెండు, మూడేళ్ల నుంచి సైబర్‌ నేరస్థులు ఇలాంటి ప్రకటనలు గుప్పిస్తున్నారు. స్పందించిన వారి నుంచి రూ.లక్షల్లో బదిలీ చేయించుకుంటున్నారు. సైబర్‌ నేరస్థుల చిరునామాలు, వివరాలు లేకుండానే ప్రకటనలు జారీ చేస్తున్నారని.. వారు చేస్తున్న నేరాలకు పరోక్షంగా సహకరిస్తున్నారంటూ పోలీసులు గతంలో ఓఎల్‌ఎక్స్‌ సంస్థ ప్రతినిధులను హెచ్చరించారు. వెంటనే స్పందించి ప్రకటనల విషయంలో మార్పులు చేయకపోయినా, సమాధానం ఇవ్వకపోయినా చట్టపరంగా చర్యలు చేపట్టనున్నామని స్పష్టం చేశారు.

రూ.కోట్లు కొల్లగొడుతున్నారు

ఒకసారి వాడిన వస్తువులను తక్కువ ధరకే విక్రయిస్తున్నామంటూ మోసగిస్తున్న ముఠాలు ఏడాది వ్యవధిలో రూ.25 కోట్లు లాగేశాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. ఈ ముఠాల్లో ఎక్కువమంది యువకులేనని వీరంతా అంతర్జాలంలో ప్రకటనలు చూసి వాటిని తమకు అనుగుణంగా మార్చుకుని మోసాలు చేస్తున్నారన్నారు. ఇందుకోసం సైన్యాధికారుల ఫొటోలు, దుస్తులను ఉపయోగించుకుంటున్నారన్నారు. వీరి సంపాదన రూ.లక్షల్లో ఉండడం వల్ల మరికొందరిని ముఠాలో చేర్చుకుంటున్నారు. ఆరు నెలల వ్యవధిలోనే భరత్‌పూర్‌లో 50కి పైగా ముఠాలు పుట్టుకొచ్చాయి. సైన్యాధికారుల పేర్లతో మోసాలు చేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నా.. సగం ధరకే బుల్లెట్‌ బైక్‌లు, కార్లు, ఐ-ఫోన్లు వస్తాయన్న ఆశతో పలువురు వీరు సూచించిన ఖాతాల్లో నగదు జమ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో సైబర్‌ నేరస్థులపై 9 వేల కేసులు నమోదయ్యాయి. నగరంలోని మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిల్లోనే 3 వేల కేసులున్నాయి. ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు ఇచ్చే సైబర్‌ నేరస్థులు ముందుగా డబ్బు పంపించాలని అభ్యర్థిస్తున్నారు. నగదు పంపించమని అడిగిన వారి వివరాలు తెలుసుకోవాలని సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ సూచించారు. వారి ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలను అంతర్జాలంలో పరిశీలించాలని, అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలన్నారు.

14 రాష్ట్రాల్లో నిరంతర మోసాలు..

సైన్యాధికారుల పేర్లు, ఫొటోలను ఉపయోగించుకుని తక్కువ ధరలకే బుల్లెట్‌లు, కార్లు, చరవాణులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఇస్తామంటూ రాజస్థాన్‌కు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయి. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఈ ముఠా సభ్యులు నిరంతరం ఇదే దందాలో నిమగ్నమై ఉన్నాయి. పశ్చిమబంగ, హరియాణా, అసోం రాష్ట్రాలకు వెళ్లి సిమ్‌కార్డులు తెచ్చుకుని ఆయా ఫోన్‌ నంబర్లను ప్రకటనలో ఇస్తున్నారు. బాధితులు స్పందించిన వెంటనే నగదు జమచేయండి.. గంటల వ్యవధిలో బైక్‌లు, చరవాణులు పంపుతామని చెబుతున్నారు. నగదు బదిలీ చేసిన తక్షణం సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు.లాక్‌డౌన్‌ అమలైనప్పటి నుంచి ఈ మోసాలు రెట్టింపయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించాక రోజుకు 20 మంది బాధితులు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు చూసి డబ్బు చెల్లించి మోసపోయామంటూ పోలీసులను అశ్రయిస్తున్నారు.

ఇవీచూడండి:మహంకాళి అమ్మవారికి ఆ ఇంటి నుంచి తొలి బోనం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details