తెలంగాణ

telangana

ETV Bharat / state

CS Meeting on Monkeys: కోతులు, అడవి పందుల కట్టడికి ప్రత్యేక కమిటీ: సీఎస్

CS review on Monkeys: కోతులు, అడవి పందుల నుంచి పంటలు దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. అటవీ, వ్యవసాయ, పంచాయతీరాజ్, పురపాలక అధికారులతో హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో సమావేశమయ్యారు.

CS Meeting on Monkeys
కోతులు, అడవి పందుల బెడదపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

By

Published : Dec 1, 2021, 8:41 PM IST

CS review on Monkeys: కోతులు, అడవి పందుల బెడద నుంచి పంటలు కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ, పశుసంవర్ధక, వ్యవసాయశాఖ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. కోతుల వల్ల పంటలు దెబ్బతినకుండా చేపట్టాల్సిన కట్టడి చర్యలపై అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ చర్చించారు. హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు అనుసరించిన ఉత్తమ విధానాలపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోతులు, పందుల నివారణకై చేపట్టాల్సిన సూచనల కోసం కమిటీ పని చేస్తుందని సీఎస్ వెల్లడించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో..

CM kcr orders: రాష్ట్రంలో కోతుల బెడద అధికంగా ఉండి రైతులు, సామాన్య ప్రజానీకం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో కోతుల బెడద నివారణకై చేపట్టాల్సిన చర్యలు సూచించాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్​ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకే బీఆర్కే భవన్​లో ఇవాళ సమావేశం నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో కోతుల బెడద నివారణకై తీసుకున్న చర్యలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో కోతుల బెడద నివారణకై కోతులకు సంతాన నిరోధక ఆపరేషన్ల నిర్వహణ, పునరావాస కేంద్రాల ఏర్పాటు, మరిన్ని ఆపరేషన్ నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, తగిన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అధికారులు, నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ... వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేసి వారం రోజుల్లోగా తగు ప్రతిపాదనలు సమర్పించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.

స్టెరిలైజేషన్ కేంద్రాల ఏర్పాటును పరిశీలించండి: సీఎస్

CS on control monkeys: కోతుల సంఖ్య తగ్గించడం, నియంత్రణకై మరిన్ని సంతాన నిరోధక ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు అంశాలపై దృష్టి సారించాలని సీఎస్ సూచించారు. పంటలను కోతుల నుంచి కాపాడుకునేందుకు రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. పలు సాంప్రదాయక విధానాలపై రైతులు, పౌరులను చైతన్య పరచాలని సీఎస్ ఆదేశించారు. పంటలను కాపాడుకునేందుకు అవలంభించాల్సిన నూతన విధానాలను రైతులకు సూచించాలన్నారు. ఈ సమావేశంలో అటవీ, వ్యవసాయ, పంచాయతీరాజ్, పురపాలక, జీహెచ్ఎంసీ అధికారులు, పశుసంవర్ధక, విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details