CP CV ANAND: ప్రతీ ఒక్కరికీ చిన్నతనం నుంచే.. "నేను పలానా కావాలి" అనే ఓ కల మదిలో ఉంటుంది. స్కూల్లో టీచర్ అడగ్గానే.. ఏం కావాలనుకుంటున్నామో.. టక్కున చెప్పేస్తాం. కొందరి విషయంలో.. వయసు పెరిగినా కొద్దీ.. ఆ కోరిక కూడా బలంగా మారి.. చివరికి అనుకున్నది సాధిస్తారు. మరికొందరి విషయంలో మాత్రం.. చిన్నప్పుడు అనుకున్న లక్ష్యం.. పక్కదారి పడుతుంది. పరిస్థితుల ప్రభావమో.. లేక వాళ్లలోని పరివర్తనో.. మొత్తానికి ఆ కల మాత్రం కలగానే మిగిలిపోతుంది. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ కావటమో.. యాక్టర్ కావాలని ఇంజినీర్ కావటమో.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ. అయితే.. ఇదే కోవకు చెందుతారు మన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ప్రసన్న వదనంతో ఉంటూనే.. నేరస్థులను గడగడలాడించే సీవీ ఆనంద్.. నిజానికి పోలీస్ కావాలనుకోలేదంటా. చిన్నప్పటి నుంచి తనను క్రికెటర్ అవ్వాలన్నది కోరికంటా.. అయితే తన చిన్ననాటి కల.. కలలాగే మిగిలిపోయిందంటూ.. ఆనాటి మధురాలను ఓ సారి జ్ఞప్తికి తెచ్చుకున్నారు.
సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీవీ ఆనంద్.. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన తాను క్రికెటర్ కావాలని అనుకున్నానని తెలిపారు. అనుకోని కారణాల వల్ల సివిల్స్ రాసి.. మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ క్రికెట్ అంటే ప్రేమ అలాగే ఉందని.. కాస్త కూడా తగ్గలేదంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.