కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అక్కడ హస్తం పార్టీ నాయకులు ప్రత్యక్షమై బాధితులకు అండగా నిలువనున్నారు. ప్రభుత్వంపై ప్రజాపోరాటం సాగించాలని భావిస్తోంది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన కాంగ్రెస్... ఇక క్షేత్రస్థాయిలో ప్రజలను కూడగట్టి ఉద్యమాలు చేయాలని నిర్ణయించింది. విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, కరెంట్ కొనుగోలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుందని ఆరోపిస్తున్న హస్తం పార్టీ... త్వరలో గవర్నర్‌ను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వంపై ఇక ప్రజాపోరాటమే..!
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం ప్రజా పోరాటాలకు సిద్ధమవుతోంది. క్షేత్ర స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా... పార్టీని బలోపేతం చేసే దిశలో హస్తం పార్టీ ముందుకు వెళ్తోంది. బడ్జెట్ కేటాయింపులపై లోతైన అధ్యయనం చేసేందుకు 11 కమిటీలను ఏర్పాటు చేసిన నాయకత్వం... అవినీతిపై గవర్నర్‌కి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.
congress