CM KCR Delhi Tour updates: దిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు రుత్వికులు యాగాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా ఈ ప్రత్యేక పూజాకార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి హస్తిన చేరిన బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఈ కార్యక్రమాలలో పాల్గోనున్నారు.
గణపతి పూజతో... రుత్వికులు యాగం మొదలు పెట్టారు. 12 మంది రుత్వికుల ఆధ్వర్యంలో పూజ, యాగాలు, పుణ్యావాచనం, యాగశాల సంస్కారం... యాగశాల ప్రవేశం, చండి పారాయణం, మూల మంత్ర జపాలు నిర్వహిస్తున్నారు. రేపు నవ చండి హోమం, రాజశ్యామల హోమం.. ఇతర పూజా కార్యక్రమాలు పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టనున్నారు. శృంగేరి పీఠం గోపికృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో... యాగాలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ విజయవంతం కావడం, దేశం సుభిక్షంగా ఉండటానికి దైవకృప కోసం యాగాలను... నిర్వహిస్తున్నారు.
భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ఏర్పాటు పనుల్లో తాను నిమగ్నం కావడంపై... మంత్రి ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా... భావసారూప్య పార్టీల నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు హాజరవుతారని.. ఆయన పేర్కొన్నారు. బుధవారం పలువురు జాతీయ నేతలతో సీఎం సమావేశం కానున్నారు.