గర్భిణీలకు 'కేసీఆర్ పౌష్టికాహార కిట్'.. వచ్చే వారమే శ్రీకారం.. KCR Nutrition Kit : ఆరోగ్య తెలంగాణలో భాగంగా గర్భిణీలకు సరైన పౌష్టికాహారం అందించేందుకు.. మరో వినూత్న కార్యక్రమంతో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. 9 జిల్లాల్లో 1.24 లక్షల మంది తీవ్ర రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారని సర్వేలో గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వపరంగా పౌష్టికాహారం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రూ.50 కోట్లతో 2,49,552 పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయనున్నారు.
5వ నెలలో ఒకసారి.. 9వ నెలలో మరోసారి ఇస్తారు. 201 ఆరోగ్య కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేస్తారు. మొదటి కిట్ విలువ రూ.1,962.. రెండో కిట్ విలువ రూ. 1,818 ఉంటుంది. ఈ పథకం వచ్చే వారం ప్రారంభం కానుంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో.. మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్ధారించింది.
అవగాహన రాహిత్యం వల్ల కూడా సమస్యలు:గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు కడుపులో బిడ్డ ఎదిగే క్రమంలో.. తల్లికి పౌష్టికాహారం ముఖ్యం. కానీ, గిరిజన, మారుమూల జిల్లాల్లోని గర్భిణులకు పౌష్టికాహారం లభించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు లేకపోవడం.. అవగాహన రాహిత్యం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని భావించింది. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావమైనప్పుడు రక్తహీనత ప్రాణాంతకంగా మారుతోంది.
బాలింతల మరణాలకు 70 శాతం ఇదే కారణం: బాలింతల మరణాలకు 70 శాతం ఇదే కారణం. నాడీ సంబంధిత సమస్యలతో పాటు.. తక్కువ బరువుతో, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం, మృతశిశువులు జన్మించడం వంటి వాటికి దారితీస్తోంది. ఐరన్‌తో పాటు విటమిన్ బీ12, ఫోలేట్, ఏ విటమిన్ లోపాల సమస్య తీవ్రతరమవుతోంది. మహిళల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ కిట్ విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడంతో.. ఇదే స్ఫూర్తితో పౌష్టికాహార కిట్ తెస్తున్నామని వివరించారు.
మాతాశిశు మరణాలను నియంత్రించవచ్చు: తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఇది మరో ముందడుగన్న హరీశ్‌రావు ఈ పథకం గర్భిణులకు వరం లాంటిదన్నారు. వారిలో పౌష్టికాహార లోపాలను తగ్గించి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన కిట్లు ఎంతో ఉపయోగపడతాయని.. వీటితో పోషకాహార లోపం నివారణే కాకుండా సిజేరియన్లు తగ్గుతాయన్నారు. మాతాశిశు మరణాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కేసీఆర్ పౌష్టికాహార కిట్.. బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తూ గర్భిణులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన అన్నారు.
ఇవీ చదవండి:నేడు పాలమూరులో సీఎం కేసీఆర్ పర్యటన.. కీలక ప్రకటనలు..!
'మోదీ'.. ఇది పేరు కాదు భాజపా బ్రాండ్.. గుజరాత్ ఎన్నికల 'ప్రచారాస్త్రం'!