హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ(హెచ్‌ఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో 126 కిలోమీటర్ల లింకు రోడ్ల పనులు చేపడుతున్నారు. రెండు ఆర్‌యూబీలు, మూడు ఆర్వోబీల నిర్మాణం పురోగతిలో ఉందని, వాహనదారులకు సౌకర్యవంతమైన రహదారుల వ్యవస్థను అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నగరంలో ప్రస్తుతం 9వేల కిలోమీటర్ల రోడ్లున్నాయి. అయినా నిత్యం వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సర్వే చేయించారు. దూర ప్రాంతాలను కలిపేలా ఖాళీ స్థలాలు, కాలనీల మీదుగా విశాలమైన రోడ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టారు.
మొత్తం 126 కి.మీ రోడ్లు అవసరమని గుర్తించగా.. మొదటి దశలో రూ.313.65 కోట్లతో 44.7 కి.మీ పొడవైన 37 లింకు రోడ్ల పనులను హెచ్‌ఆర్‌డీసీఎల్ ప్రారంభించింది. 4 రోడ్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా 19 మార్గాల పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 14 పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ జరుగుతోందని కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు.
ఆర్‌యూబీల విస్తరణ
మలక్‌పేట ఆర్‌యూబీ(రైల్వే అండర్ బ్రిడ్జి) విస్తరణకు రూ.18.14 కోట్లు, రాణిగంజ్ ఆర్‌యూబీకి రూ.16.44 కోట్లు, ఫతేనగర్ ఆర్వోబీ(రైల్వే ఓవర్ బ్రిడ్జి) నిర్మాణానికి రూ.45.04 కోట్లు, ఎన్‌ఎఫ్‌సీ ఆర్వోబీకి రూ.32.02 కోట్లు, బొల్లారం ఆర్వోబీకి రూ.57.33కోట్లను బల్దియా సిద్ధంచేసింది. నగరంలో మరో 48.6 కి.మీ మేర కారిడార్ల అభివృద్ధి సైతం చేపట్టనుంది.
- ఇదీ చూడండి: ప్రియురాలిని కలిసేందుకు పాక్‌కు పయనం.. కానీ!