BJP Polling Booth Committees Meeting: అధికారమే లక్ష్యంగా.. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులను.. సన్నద్ధం చేసేందుకు.. ఆ పార్టీ రాష్ట్ర శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా.. 119 అసెంబ్లీ నియోజవర్గాల్లో.. బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే సరల్ యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. శ్రేణులకు మార్గనిర్దేశం చేయాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో జరగలేదు.
గతంలో మాట్లాడిన జేపీ నడ్డా.. సందేశాన్ని కార్యకర్తలకు వినిపించారు. అనంతరం మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు రైతు బంధు డబ్బులను బకాయిల కింద జమ చేసుకుంటున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సరల్ యాప్ ద్వారా ప్రసంగించిన కిషన్‌రెడ్డి.. బీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. కేంద్రం నిధులను పక్కదారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
ప్రతి కార్యకర్త నిర్మాణాత్మకంగా కృషి చేయాలి: రాష్ట్రంలో బీజేపీ అధికారం చేజిక్కించుకునే దిశలో ప్రతి కార్యకర్త నిర్మాణాత్మకంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని.. రాజసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీజేపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గద్వాలలో పోలింగ్ బూత్ స్థాయి కమిటీ సమావేశానికి.. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హజరయ్యారు.
సాంకేతిక లోపమా.. కావాలనే చేశారా:మెదక్‌లో ఏర్పాటు చేసిన బూత్ కమిటీకి.. మెదక్ అసెంబ్లీ పాలక్, ఎంపీ అర్వింద్ హాజరయ్యారు. సరల్ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకుని.. బూత్ స్థాయిలో పట్టిష్టం చేయాలని ఆయన సూచించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ సహా.. పలు నియోజకవర్గాల్లో బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాల తర్వాత.. స్థానిక నేతలు శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగ సమయంలోనే.. వరంగల్ తూర్పు నుంచి ఈటల రాజేందర్ ప్రసంగించారు. ఇలా జరగడం సాంకేతిక లోపమా.. కావాలనే చేశారా అనే దానిపై పార్టీ ఆరా తీస్తోంది. బండి సంజయ్ ప్రసంగాన్ని.. వరంగల్ తూర్పు తప్ప.. మిగతా 118 నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఆసక్తిగా ఆలకించారు.