Niranjan reddy on Pmksy: 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో కొత్త రైతులు నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ "ఘాఠా" యోజన అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద 66 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతున్నారని. అదే పీఎంకేఎస్‌వై కింద ఏడాదికి 6 వేల రూపాయల వస్తున్నది 35.74 లక్షల మంది రైతులకేనని తెలిపారు. రైతుబంధు పథకం కింద ఈ వానాకాలం సీజన్‌తో కలుపుకుంటే 58 వేల కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లవుతుందని ప్రకటించారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. పీఎంకేఎస్‌వై కింద ఇప్పటి వరకు రైతులకు అందింది కేవలం 7689 కోట్ల రూపాయలు మాత్రమేనని గుర్తు చేశారు. కొత్త వారి నమోదుకు అవకాశం లేకుండా చేశారన్నారు. 2019 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత కొత్తగా ఒక్కరికి కూడా ఇచ్చింది లేదని ఆక్షేపించారు.
ఇక 2024 వరకు కొత్త రైతులకు అవకాశం లేకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదాయం పన్ను కట్టినా.. 10 వేల రూపాయల వేల పెన్షన్ వచ్చినా... ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా... పదవీ విరమణ చేసినా... తమ తమ అసోసియేషన్లలో నమోదు చేసుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆర్కిటెక్టులు, ఛార్టెడ్ అకౌంటెట్లు ఈ పథకం కింద అనర్హులు అని తెలిపారు. రైతుబంధు గురించి రైతుల ప్రయోజనాల గురించి రంకెలు వేసే తెలంగాణ భాజపా నేతలు ఈ విషయంలో ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులు కొత్త వారికి కూడా ఈ పథకం వర్తించేలా ఎందుకు కృషి చేయరని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏటా రైతుబంధు కింద 15 వేల కోట్ల రూపాయలు, రైతుబీమా కింద 1500 కోట్ల రూపాయలు వెచ్చిస్తుండగా కేంద్రం ఏటా పీఎంకేఎస్‌వై కింద రైతులకు ఇచ్చేది కేవలం 2200 కోట్ల రూపాయలు మించి లేదని మండిపడ్డారు.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి గరిష్ఠంగా కేటాయించిన బడ్జెట్ ఎన్నడూ 3 వేల కోట్ల రూపాయలు మించలేదు... అదే స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ఏడాదికి 15 వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి వేస్తున్నారని చెప్పారు. గతంలో వ్యవసాయ రంగ పథకాలు అన్నీ కలిపితే ఒక మండలంలో లబ్ధిదారులు కేవలం 200 నుంచి 500 మంది లోపు మాత్రమే ఉండేదని తెలిపారు. రైతుబంధు ద్వారా భూమి ఉన్న ప్రతి రైతుకు నేరుగా సాయం అందుతుందని... అటవీ చట్టం ఆధీనంలో ఉన్న రైతుల భూములకు కూడా రైతుబంధు సాయం అందించడం జరుగుతుందని, కేంద్రం అడ్డగోలు నిబంధనల వల్ల ప్రతి విడతలో 30 లక్షల మంది తెలంగాణ రైతులకు ప్రయోజనాలు అందడం లేదని అన్నారు. రాయితీలు తగ్గిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ... రైతుల పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేయడంలో విజయవంతం అయ్యారని మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యంగాస్త్రాలు విసిరారు.