'సేంద్రీయం'తోనే ఆరోగ్యం
హైదరాబాద్ శిల్పారామంలోని జాతీయ సేంద్రీయ మేళాకు సందర్శకులు పోటెత్తుతున్నారు. వైవిధ్యమైన పంటలు, సేంద్రీయ ఉత్పత్తులు, అదనపు విలువ జోడించి తయారు చేసిన ఆహార పదార్థాలు వారిని ఆకట్టుకుంటున్నాయి. ఈ మేళా ముగింపు వేడుకకు ఈరోజు నిజామాబాద్ ఎంపీ కవిత ముఖ్య అతిథిగా రానున్నారు
సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి తయారు చేసిన భిన్న రుచులతో కూడిన ఆహార పదార్థాలు, మంచి ఔషధ విలువలు కలిగిన ఉత్పత్తులు, చిరుధాన్యాలతో తయారైన చిరుతిండ్లు, ఇతర ఆహార పదార్థాలు కొనుగోలు చేసేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి స్టాల్‌లోని ఉత్పత్తుల గురించి వివరంగా అడిగి తెలుసుకుంటున్నారు. నిత్యజీవితంలో వాడే వస్తువులు ఎలా తయారవుతాయో ఇలాంటి ప్రదర్శనల వల్ల తెలుసుకునే అవకాశం లభిస్తుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
సందర్శకుల సౌకర్యార్థం ఆర్గానిక్ తాలి, ప్లాటినం, చాయ్జో, శాంతన వంటి రెస్టారెంట్లు, అంకుర కేంద్రాల నిర్వాహకులు చిరుధాన్యాల వంటకాలు తయారు చేసి రుచి చూపిస్తున్నారు. ప్రభుత్వం సేంద్రియ వ్యవయసాయాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తే ఆరోగ్యకరమైన ఉత్పత్తులు వస్తాయని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు.