Medaram Jatara 2022: నాలుగు రోజులపాటు మేడారంలో గద్దెలపై కొలువుదీరడానికి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రాళ్లగడ్డ నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజుతో వడ్డెలు, తలపతులు గిరిజన సంప్రదాయాల మధ్య కాలినడకన పయనమయ్యారు. కొడవటంచ సమీపంలోని బర్లగుట్టపై పగిడిద్దరాజు కొలువై ఉన్నాడు. యాపలగడ్డకి చెందిన అరెం వంశస్తులు పగిడిద్దరాజును ఇలవేల్పుగా కొలుస్తారు. మేడారం జాతరకు మూడు రోజుల ముందుగానే యాపలగడ్డ ఆలయంలోని ఈలు, బల్లెం పడగలు, జేగంటలను సేకరించి కాలినడకన వారు బయలుదేరడం ఆనవాయితీ. తొలిరోజు రోళ్లగడ్డ, దేవళ్లగూడెం, లింగాల మీదుగా వెళ్లి కొడిశలలో బసచేస్తారు. రెండో రోజు పస్రా సమీపంలోని ఒడ్డుగూడెంలో బసచేస్తారు. మూడో రోజు మేడారంలోని సమ్మక్క గద్దెల మీదికి చేరుకుంటారు. అరెం వంశీయులు పగిడిద్ద రాజుతో మేడారం చేరుకున్న తర్వాత తొలి రోజు జాతర ప్రారంభమవుతుందని పూజారులు తెలిపారు. బుధవారం సారలమ్మ, గోవిందరాజు గద్దెలపైకి వచ్చే సమయానికి పగిడిద్దరాజు మేడారానికి చేరుకుంటారు. ఈ ముగ్గురు దేవతలను ఒకే సమయంలో అధికార లాంఛనాలతో గద్దెలపై చేర్చుతారు. దీంతో మహాజాతర ఆరంభమవుతుంది.
మార్గమధ్యలో గ్రామాలు ఇవే
మేడారం వెళ్లే దారిలో పూజారులకు 10 గ్రామాలు ఎదురవుతాయి. కర్లపల్లి, లక్ష్మీపురం, మొద్దులగూడెం, పస్రా, ప్రాజెక్టునగర్, వెంగ్లాపూర్, నార్లాపూర్, చింతల్ క్రాస్‌రోడ్డు, పడగాపూర్, జంపన్నవాగు మీదుగా చేరుకుంటారు.
రహస్య పూజల మధ్య
కాలినడక దారిలో ఎదురుపడే వాగులు, వంకల్లోని నీటిని దాటే ముందు ప్రత్యేకంగా జల పూజలు నిర్వహిస్తారు. గతంలో అధికారులు కాలినకన అంత దూరం నుంచి రావొద్దంటూ..ఏదైనా వాహనంలో రావాలని సూచించగా ఆచారం, సంప్రదాయాలను వదలబోమని చెప్పామని పూజారులు పేర్కొన్నారు. ఎంత కష్టమైనా కాలినడకనే పగిడిద్దరాజును గద్దెకు చేర్చడం తమ ఆచారమన్నారు. వెంగ్లాపూర్ చేరగానే పోలీసుల రోప్ పార్టీ పగిడిద్దరాజును బందోబస్తు మధ్య గద్దెల వద్దకు తీసుకెళ్తారు. దీంతో పగిడిద్దరాజు పూజారులు బహుదూరపు బాటసారులుగా జాతర చరిత్రలో నిలుస్తున్నారు.
70 కిలోమీటర్ల దూరం..