ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు మాజీ నక్సలైట్ ద్విచక్రవాహన యాత్ర చేపట్టాడు. జనజీవన స్రవంతిలో కలిసినా తమకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సీఎంను కలిసి తన బాధను విన్నవించేందుకు రాజధానికి పయనమయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన కోరం వెంకటేశ్వర్లు సమ్మక్క-సారలమ్మ దీక్ష తీసుకుని వెళ్తున్నట్లు తెలిపాడు.
న్యాయం కోసం బైక్ యాత్ర.. సీఎంను కలిసేందుకే.! - తెలంగాణ వార్తలు
జనజీవన స్రవంతిలో కలిసినా న్యాయం జరగడం లేదంటూ మాజీ నక్సలైట్ ద్విచక్రవాహన యాత్ర చేపట్టాడు. సీఎం కేసీఆర్ను కలిసి తన ఆవేదన తెలియజేస్తానని అంటున్నాడు. తాను సాగు చేసుకుంటున్న పోడు భూమిని దక్కేలా, గిరిజనులకు న్యాయం జరిగే విధంగా ప్రజాప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన కోరం వెంకటేశ్వర్లు తెలిపారు.

పద్నాలుగేళ్ల తర్వాత సాధారణ ప్రజానీకంలో కలిసి... తాము సాగు చేసుకుంటున్న పోడు భూమిపై హక్కులు దక్కేలా ప్రజాప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించాడు. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని ఆయన కోరాడు. ప్రభుత్వ ఆదేశాలతో లొంగిపోయిన తమకు భూమి, ఇల్లు రాకపోగా తల్లిదండ్రులు నుంచి వస్తున్న భూమిని సైతం అటవీశాఖ అధికారులు కందకం పనులతో ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడు. దీనిపై ఇప్పటికే జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలియజేసినట్లు వెల్లడించాడు. పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావును కలిసి ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా కోరనున్నట్లు కోరం వెంకటేశ్వర్లు తెలిపాడు.