తెలంగాణ

telangana

ETV Bharat / state

రామయ్యకు నిత్య ఆర్జిత సేవలకు.. దేవాదాయ శాఖ అనుమతులు

ఏడు నెలల నిరీక్షణ అనంతరం భద్రాద్రి రామయ్య సన్నిధి పూర్వ వైభవం సంతరించుకోనుంది. కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఏడు నెలల నుంచి భద్రాచలం రాములవారి సన్నిధిలో ఆర్జిత సేవలు నిలిపివేశారు. ప్రతిరోజు వేలసంఖ్యలో భక్తులు భద్రాద్రి రామయ్యను దర్శించుకునేవారు. కరోనా మహమ్మారి కారణంగా పరిమిత సంఖ్యలో దర్శనాలకు అనుమతిస్తున్నారు. కాగా.. తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి.. రేపటి నుంచి భద్రాచలంలో రాములవారి ఆర్జిత సేవలకు అనుమతి ఇచ్చింది.

Bhadrachalam Ramayya Temple is Open For All From Tomorrow
రామయ్యకు నిత్య ఆర్జిత సేవలకు.. దేవాదాయ శాఖ అనుమతులు

By

Published : Oct 4, 2020, 7:09 PM IST

గత ఏడు నెలల నుంచి భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆర్జిత సేవలు నిలిపివేయడం వల్ల ఏటా నిర్వహించే రాముల వారి కల్యాణం కూడా పరిమిత భక్తులతో మాత్రమే నిర్వహించారు. ప్రతి ఏటా సీతారాముల కల్యాణానికి రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు. సీతారాముల కల్యాణం ద్వారా ప్రతి ఏటా ఆలయానికి సుమారు రెండు కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఈ ఏడాది కళ్యాణానికి ముందే కరోనా ప్రభావం పడటం వల్ల గత ఏడు నెలల నుంచి ఆర్జిత సేవలు నిలిపివేశారు. కరోనా కారణంగా ఇప్పటివరకు సుమారు రూ.10 కోట్ల పైన దేవాలయం ఆదాయానికి గండి పడింది.

కరోనా భయంతో గత ఏడు నెలల నుంచి భక్తులు చాలా తక్కువ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రామయ్య ఆలయానికి ఆదాయం చాలావరకు తగ్గిందని ఆలయ అధికారులు చెప్తున్నారు. రేపటి నుంచి స్వామివారికి జరుగనున్న నిత్య కల్యాణం ప్రతి శనివారం జరుగనున్న బంగారు తులసి దళాల అర్చన.. ప్రతి ఆదివారం నిర్వహించే పంచామృతాల అభిషేకం, బంగారు పుష్పార్చనలు భక్తులు వీక్షించనున్నారు. అయితే స్వామివారికి జరిగే ఈ ఆర్జిత సేవలు భక్తులను యాభైశాతం వరకే అనుమతించాలని దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తప్పనిసరిగా ఆలయానికి వచ్చే భక్తులకు శానిటైజర్ ఇవ్వాలని, మాస్కు తప్పని సరిగా ధరించాలని, థర్మల్ స్క్రీనింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. భక్తునికి.. భక్తునికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలని నిబంధన విధించింది. దూర ప్రాంతాల నుంచి భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మాత్రం బస చేసేందుకు యాభైశాతం వరకే గదులను అనుమతించాలని నిబంధన విధించింది.

భక్తులకు కేశఖండన చేసే కల్యాణ కట్ట ప్రారంభించడానికి ఇంకా అనుమతులు రాలేదు. దేవాదాయ శాఖ అనుమతి వచ్చిన తర్వాతనే కల్యాణ కట్టలో కేశఖండన ప్రారంభమవుతుందన్నారు. రేపటి నుంచి నిత్య కల్యాణాలు, దర్బారు సేవ, సంధ్యా హారతి వంటి ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏడు నెలల నిరీక్షణ అనంతరం భద్రాద్రి రామయ్య సన్నిధికి పూర్వవైభవం రానున్నది. దసరా ఉత్సవాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉత్సవాలు ఎలా జరుపాలనే ఆదేశాలు మాత్రం ఇంకా ఆలయ అధికారులకు అందలేదు. ఇకపై ఆలయ ప్రదేశాల్లోని గల దుకాణదారుల వ్యాపార లావాదేవీలు కూడా తిరిగి పుంజుకోనున్నాయి.

ఇవీ చూడండి:బాలికపై నలుగురు 'అత్యాచారం'.. గర్భం దాల్చగా వెలుగులోకి!

ABOUT THE AUTHOR

...view details