తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బక్కచింతలపాడు గ్రామంలో ఆదివాసీల( Aborigines) భూమి పండుగ ఘనంగా ప్రారంభమైంది. వానకాలం ఆరంభంలో జరిగే ఈ భూమి పండుగ మూడు రోజులపాటు నిర్వహిస్తారు.
గ్రామంలోని పెద్దలు, పూజారుల నేతృత్వంలో ప్రారంభమైన భూమి పండుగలో అడవి తల్లికి సాంప్రదాయ పూజలు నిర్వహించారు. మొదటిరోజు గ్రామంలోని మగవాళ్లు అందరూ ఇళ్లు వదిలి అడవికి బయలుదేరి అక్కడే వంటా-వార్పు చేసుకుంటారు. తదుపరి సురాపానం స్వీకరించి అడవి తల్లికి తమ మొక్కులను సమర్పించుకుంటారు. అడవి ఫలాలను ఆదివాసీల ఆరాధ్యదైవాలకు సమర్పిస్తారు. మగవాళ్లు జంతువులను వేటాడటం వారి ఆనవాయితీ. పండుగ తొలి రోజు అడవిలో జంతువులను పక్షులను వేటాడటానికి మూకుమ్మడిగా విల్లులు, బాణాలతో అడవికి వెళ్లి అక్కడే నిద్ర చేసి వస్తారు.