Adilabad New Collectorate Work Start :ఆదిలాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ సమీకృత భవన సముదాయం నిర్మాణానికి మార్గం సుగమమైంది. జిల్లాల పునర్విభజన తరువాత నిర్మల్, కుమురంభీం, మంచిర్యాల జిల్లాలకు కొత్త కలెక్టరేట్ భవనాల మంజూరే కాదు.. నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రారంభమైనప్పటికీ.. ఆదిలాబాద్ జిల్లాకు అవకాశం రాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నూతన భవనానికి నిధులు మంజూరు చేయడంతో ఇక పనులు ఊపందుకోనున్నాయి.
Construction of New Collectorate Building in Adilabad : ఉత్తర, దక్షిణ భారతావనికి వారధిగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా పాత కలెక్టరేట్ భవనం వారసత్వ కట్టడంగా మిగిలిపోనుంది. మరో ఏడాదిలోగా కొత్త కలెక్టరేట్ భవనం అందుబాటులోకి రానుంది. బట్టిసావర్గాం శివారును ఆనుకుని సర్వే నెంబర్ 72/1/6లోని 19 ఎకరాల్లో భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.55 కోట్ల మంజూరు చేసింది. ఛాబ్రా కంపెనీ పనులు దక్కించుకుంది.
కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలి : ఈ సంస్థకు ఇప్పటికే సిద్ధిపేట, మెదక్ నూతన కలెక్టరేట్లను నిర్మించిన అనుభవం ఉంది. ఆదిలాబాద్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ఏడాదిలోగా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆగమేఘాలపై పనులపై అధికారులు దృష్టిసారించారు. జీ ప్లస్-2 అంతస్థులతో లక్షా 20వేల చదరపు అడుగులతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఏర్పాటు కానుంది. ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలోనే భవన నిర్మాణం పూర్తి చేస్తామనే ధీమా అధికారుల్లోనే కాకుండా పనులను దక్కించుకున్న గుత్తేదారుల్లోనూ వ్యక్తమవుతోంది.