రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో క్రీడల మంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటీసుకు డబ్ల్యూఎఫ్‌ఐ శనివారం జవాబిచ్చింది. లైంగిక వేధింపులు సహా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చింది. నిరసన వెనుక ప్రస్తుత పాలకులను దించాలన్న రహస్య అజెండా ఉందని పేర్కొంది.
రెజ్లర్ల ఆరోపణలను తోసిపుచ్చిన డబ్ల్యూఎఫ్‌ఐ.. సహాయ కార్యదర్శి సస్పెండ్
అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై వస్తున్న ఆరోపణలను డబ్ల్యూఎఫ్ఐ తోసిపుచ్చింది. రెజ్లర్ల నిరసన వెనుక రహస్య అజెండా ఉందని తెలిపింది. ఈ మేరకు క్రీడల మంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటీసుకు జవాబిచ్చింది.
"రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన కమిటీ డబ్ల్యూఎఫ్‌ఐని నడిపిస్తోంది. అధ్యక్షుడు సహా ఏ ఒక్కరో సమాఖ్యను ఇష్టమొచ్చినట్లు నడపలేరు. ప్రస్తుత అధ్యక్షుడు ఆధ్వర్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ ఎల్లప్పుడూ రెజ్లర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పని చేసింది. సమాఖ్య దేశంలో రెజ్లింగ్ స్థాయిని పెంచింది. డబ్ల్యూఎఫ్‌ఐ నిజాయితీగా, కఠినంగా ఉండకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. అధ్యక్షుడిపై ఆరోపణలు దురుద్దేశంతో కూడుకున్నవి. వాళ్లు స్వార్థ ప్రయోజనాల కోసమో లేదా ఎవరి ఒత్తిడి వల్లనో అలా చేస్తుండొచ్చు. డబ్ల్యూఎఫ్‌ఐ ప్రస్తుత మేనేజ్‌మెంట్ లేదా అధ్యక్షుడిని అప్రతిష్ఠపాలు చేయాలన్న కుట్రలో ఇదంతా భాగమై ఉండొచ్చు కూడా" అని డబ్ల్యూఎఫ్‌ఐ వివరించింది. నిరసన చేసిన వారిలో హరియాణా వాళ్లే ఎక్కువ మంది ఎందుకు ఉన్నారని సమాఖ్య ప్రశ్నించింది.
అన్ని కార్యకలాపాల రద్దు:
బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలపై విచారణకు ఓ పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేస్తామని, దర్యాప్తు పూర్తయ్యేవరకు అతడు పక్కకు తప్పుకుంటాడని క్రీడల శాఖ హామీ ఇచ్చిన నేపథ్యంలో రెజ్లర్లు నిరసన విరమించిన సంగతి తెలిసిందే. కమిటీ సభ్యుల పేర్లను ఆదివారం ప్రకటిస్తామని క్రీడల శాఖ శనివారం చెప్పింది. ఈ కమిటీ సమాఖ్య దైనందిన వ్యవహారాలు చూసుకుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ర్యాంకింగ్ పోటీలు సహా.. కమిటీ బాధ్యతలు తీసుకునేంత వరకు రెజ్లింగ్ సమాఖ్య కార్యకలాపాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు క్రీడల శాఖ ప్రకటించింది. అలాగే.. డబ్ల్యూఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌ను సస్పెండ్ చేసింది.