తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎవరీ నీరజ్ చోప్డా? ఊబకాయుడి నుంచి ఒలింపిక్ ఛాంపియన్​గా..

నీరజ్‌ చోప్డా.. చిన్నతనంలో జాగింగ్‌కు వెళ్లమంటే.. అమ్మో నేను చేయలేనని దుప్పటి కప్పుకొని పడుకునేవాడు.. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టక పన్నేండేళ్ల వయసులో 90కిలోల బరువుతో ఊబకాయుడిగా మారాడు. అలాంటి వ్యక్తి.. జావెలిన్‌ త్రో ఛాంపియన్‌గా ఎదుగుతాడని, ఒలింపిక్స్‌లో అద్భుతం సృష్టిస్తాడని ఎవరైనా ఊహించగలరా! కానీ, అదే జరిగింది. అనుకోకుండా ఆడిన ఆటను ఎంతో ఇష్టంగా మార్చుకున్నాడు. ఆ ఆటలో ప్రాణం పెట్టాడు. దానికి ఫలితమే ఈ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం.

neeraj chopra
ఎవరీ నీరజ్ చోప్రా

By

Published : Aug 7, 2021, 6:54 PM IST

Updated : Aug 7, 2021, 9:21 PM IST

హరియాణా నుంచి వచ్చిన మరో ఆణిముత్యం నీరజ్‌ చోప్డా. ఇప్పటికే ఆ రాష్ట్రం నుంచి రవి కుమార్‌ దహియా ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ పోటీలో రజతం దక్కించుకున్నాడు. తాజాగా జావెలిన్‌ త్రోలో నీరజ్‌ ఏకంగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అసమాన ప్రదర్శనతో భారతీయులందరినీ గర్వించేలా చేశాడు.

స్వర్ణ పతకంతో నీరజ్

హరియాణాలోని పానీపత్​ జిల్లా ఖంద్రా గ్రామానికి చెందిన 23 ఏళ్ల నీరజ్‌ చోప్డా అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవాళ్లే. చిన్నతనంలో నీరజ్‌ చాలా బద్ధకంగా ఉండేవాడట. దీంతో 12 ఏళ్లకే 90కిలోల బరువు పెరిగాడు. ఇంట్లో వాళ్లు జాగింగ్‌, వ్యాయామం చేయమన్నా ససేమిరా అనేవాడు. ఫిట్‌నెస్‌ గురించి అసలు ఆలోచించేవాడు కాదు.

స్వర్ణం ఖాయమైన తర్వాత త్రివర్ణ పతాకంతో..

నీరజ్‌ జీవితాన్ని మలుపు తిప్పిన సందర్భం

కుటుంబం బలవంతం మేరకు ఓసారి నీరవ్‌ స్థానిక శివాజీ స్టేడియంలో జాగింగ్‌ చేయడానికి వెళ్లాడు. అక్కడే అతడికి జావలిన్‌ త్రో ఆటగాడు జై చౌధరీ తారసపడ్డాడు. జావెలిన్‌ త్రోను చేతికిచ్చి విసరమని జై చెప్పగానే భారీకాయంతో కూడా నీరవ్‌ ఎంతో చక్కటి ప్రదర్శన కనబర్చాడట. ఆటపై అసలు ఏ మాత్రం అవగాహన లేకపోయినా తొలిసారే 35-40మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడని.. అది ఎంతో గొప్ప విషయమని జై ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతడి శరీరం ఈ ఆటకు ఎంతో అనువుగా ఉందని, జావెలిన్‌ను విసిరే శైలి ఆకట్టుకునేలా ఉందని పేర్కొన్నాడు.

బల్లెం బుల్లోడు

జై చౌధరీ ఏ క్షణాన జావెలిన్‌ను నీరజ్‌ చేతికి ఇచ్చాడో తెలియదు గానీ.. ఆ ఆటపై నీరజ్‌కు ఆసక్తి పెరిగింది. జావెలిన్‌లో శిక్షణ పొందాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వ్యాయామమంటే ఏమాత్రం ఇష్టం లేని నీరజ్‌ బరువు తగ్గడానికి సిద్ధపడ్డాడు. ఊహించని ఈ మార్పుతో అతడి కుటుంబసభ్యులు ఒకవైపు ఆశ్చర్యపోయినా.. అతడి ఇష్టాన్ని కాదనలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. నీరజ్‌ శిక్షణకు కావాల్సినవన్నీ సమకూర్చారు.

ఒలింపిక్ స్టేజీపై నీరజ్

కెరీర్‌ మొదలైందిలా..

ఒకవైపు చదువును కొనసాగిస్తూనే నీరజ్‌ 2013లో ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌, 2015లో ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా.. మంచి ప్రదర్శనే చేశాడు. 2016 నుంచి నీరజ్‌ కెరీర్‌.. పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. ఆ ఏడాదిలో జరిగిన సౌత్‌ ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏషియన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు. వరల్డ్‌ అండర్‌ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు.. జావెలిన్‌ను 86.48మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ పోటీల్లో మొత్తంగా ఏడు స్వర్ణ పతకాలు, నాలుగు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి అగ్రశ్రేణి ఆటగాడిగా అవతరించాడు. 2018లో గోల్డ్‌కోస్ట్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కేంద్రం నీరజ్‌ను అర్జున అవార్డుతో సత్కరించింది.

రెండు, మూడో స్థానంలో నిలిచిన అథ్లెట్లతో నీరజ్

భుజానికి గాయం.. పునరాగమనం

నీరజ్‌ కెరీర్‌లో 2019 సంవత్సరం ఒక చేదు జ్ఞాపకం. ఎందుకంటే.. భుజానికి గాయం, శస్త్రచికిత్స కారణంగా అతడు ఆ ఏడాదిలో జరిగిన పోటీల్లో పాల్గొనలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నీరజ్‌ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వివిధ పోటీల్లో పాల్గొంటూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా పరుగులు తీశాడు. తనలో ఎలాంటి మార్పూ రాలేదని నిరూపిస్తూ.. ముందులాగే రికార్డుల పర్వం కొనసాగించాడు. ఆ సమయంలో ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా ముచ్చటించిన నీరజ్.. తను మునుపటిలా ఫిట్​గా తయారు కావడానికి చేసిన కృషిని వివరించాడు.

స్వర్ణం అందుకున్న తర్వాత..

అనంతరం, 2020లో ఒలింపిక్‌ కోటాలో పలు పోటీల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది మార్చి 2021లో జరిగిన జావెలిన్‌ త్రో పోటీలో పాల్గొని మరో రికార్డు సృష్టించాడు. 2018లో తన పేరుపై ఉన్న 87.43మీటర్ల రికార్డును 88.07మీటర్లతో బద్దలుకొట్టాడు.

ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధత

ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా నీరజ్‌ చోప్డా కఠోర శిక్షణ తీసుకున్నాడు. తన ఉత్తమ ప్రదర్శనలతో జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ ఎక్సలెన్సీ ప్రోగ్రామ్‌లో చోటు దక్కించుకున్న నీరజ్‌.. ఆస్ట్రేలియా కోచ్‌ గారీ కాల్వర్ట్‌ వద్ద శిక్షణ పొందాడు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే స్వర్ణం గెలిచి.. తన కలను నెరవేర్చుకున్నాడు. ఎన్ని ఘనతలు సాధించినా.. తన విజయానికి కారణం తన కోచ్‌, కుటుంబసభ్యులేనని నీరజ్‌ ఎంతో విన్రమంగా చెబుతున్నాడు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 7, 2021, 9:21 PM IST

ABOUT THE AUTHOR

...view details