ఐపీఎల్ సూపర్ సక్సెస్ తర్వాత ఇతర క్రికెట్ బోర్డులు కూడా ఈ తరహా టీ20 లీగ్‌లకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే బిగ్‌బ్యాష్, కరీబియన్, పీఎస్ఎల్, బీపీఎల్ మొదలైన టీ20 లీగ్‌లు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో రెండు టీ20 లీగ్‌లు చేరనున్నాయి. యూఏఈ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో ఒకటి.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహణలో మరొకటి వచ్చే ఏడాది ఆరంభం కానున్నాయి. ఈ యూఏఈ టీ20 లీగ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఐపీఎల్ స్టార్ ఫ్రాంఛైజీలు అయిన ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ఇందులో భాగం కానున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ టీ20 లీగ్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు నిర్వహకులు.
వాళ్లు ఈ లీగ్‌లో ఆడొచ్చు: యూఏఈ టీ20 లీగ్‌లో భాగమైన ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తమ మాతృఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చని నిర్వహకులు ప్రకటించారు. అంటే ఐపీఎల్లో కీలక ఆటగాళ్లు అయిన పొలార్డ్, రసుల్, టిమ్ డేవిడ్ మొదలైన వారు యూఏఈ టీ20 లీగ్‌లోని జట్లలో ఫ్రాంఛైజీలు ఆడించే అవకాశం ఉంది. కానీ ఒక జట్టుకు కేవలం నలుగురు ఆటగాళ్లకు మాత్రమే అనుమతించారు. కాగా, ఈ లీగ్‌కు ఆటగాళ్ల ఎంపిక ఎలా ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా డ్రాఫ్ట్ లేదా ఆక్షన్ విధానంలో ఆటగాళ్ల ఎంపిక ఉంటుంది. అయితే డ్రాఫ్ట్ విధానానికే నిర్వహకులు మొగ్గు చూపినట్లు సమాచారం. మరోవైపు ఫ్రాంఛైజీలు తమ జట్లకు ఎంపిక చేసుకునే ఆ నలుగురు ఆటగాళ్లు తమ దేశబోర్డు నుంచి ఎన్ఓసీ పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 2023 జనవరి-ఫిబ్రవరి మధ్య ప్రారంభంకానున్న ఈ లీగ్‌లో ఆరు జట్లు తలపడనున్నాయి.