Roe Root Test Record: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టులో భాగంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు రూట్. ఈ క్రమంలోనే ఓ క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లు సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్లను దాటేశాడు.
ప్రస్తుతం ఈ ఏడాది టెస్టు క్రికెట్లో 1563* పరుగులతో కొనసాగుతున్నాడు రూట్. ఈ క్రమంలోనే సచిన్ (1562), గావస్కర్ (1555)లను దాటేశాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడీ ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్. మరో 32 పరుగులు చేస్తే ఆసీస్ మాజీ సారథి మైఖేల్ క్లర్క్ (1595)ను కూడా దాటేసి నాలుగో స్థానానికి చేరుకుంటాడు.
2006లో 11 టెస్టుల్లో 99.33 సగటుతో 1788 పరుగులు చేసిన పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ యూసుఫ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 1976లో 11 టెస్టుల్లో 1710 పరుగులు చేసిన వెస్టిండీస్ బ్యాటర్ వివ్ రిచర్డ్స్ రెండో స్థానంలో ఉండగా.. 2008లో 15 మ్యాచ్ల్లో 1656 పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆటగాడు గ్రీమ్ స్మిత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది రూట్ ఆరు సెంచరీలు సాధించాడు. ఇందులో రెండు ద్విశతకాలు, రెండు అర్ధశతకాలు కూడా ఉన్నాయి.
పోరాడుతున్న ఇంగ్లాండ్
AUS vs ENG 2nd Test: ఇక ఈ రెండో టెస్టులో మూడో రోజు డిన్నర్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది ఇంగ్లాండ్. హమీద్ (6), బర్స్న్ (4) త్వరగానే పెవిలియన్ చేరినా.. కెప్టెన్ రూట్ (57*), మలన్ (68*) సమయోచితంగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇంకా 333 పరుగులు వెనకపడి ఉంది ఇంగ్లీష్ జట్టు.