తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోట్లు కురిసే వేళ.. బరిలో స్టార్​ ఆటగాళ్లు

ఐపీఎల్​ 14వ సీజన్​ మినీ వేలానికి రంగం సిద్ధమైంది. గురువారం చెన్నై వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రముఖ భారత ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లూ బరిలో ఉన్నారు. ఏ ఫ్రాంచైజీ ఎవర్ని సొంతం చేసుకుంటుందో మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది.

IPL 2021 auction: All you need to know as 292 players go under the hammer
కోట్లు కురిసే వేళ.. బరిలో స్టార్​ ఆటగాళ్లు

By

Published : Feb 18, 2021, 6:44 AM IST

అనామక ఆటగాళ్లను కోటీశ్వరులుగా మార్చేసి.. అగ్రశ్రేణి ఆటగాళ్లకు ఊహించని ధర కట్టబెట్టే.. ఐపీఎల్‌ వేలానికి మరోసారి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జరిగే 14వ సీజన్‌ కోసం చెన్నై వేదికగా గురువారం వేలం నిర్వహించనున్నారు. ప్రముఖ భారత ఆటగాళ్లతో పాటు ప్రధాన విదేశీ క్రికెటర్లూ బరిలో నిలవడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఒక్క అవకాశమంటూ ఎదురుచూస్తున్న దేశవాళీ కుర్రాళ్లకూ మంచి ధర దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఫ్రాంఛైజీల మెప్పు పొందేదెవరో? అత్యధిక ధర దక్కించుకునేదెవరో?

తొలిసారి ఆడేందుకు..

డేవిడ్ మలన్

ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపుపొందిన ఐపీఎల్‌ లాంటి ప్రతిష్ఠాత్మక టీ20 లీగ్‌లో ఆడేందుకు ఎంతో మంది ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఈ సారి కూడా లీగ్‌లో అరంగేట్రం చేసే అవకాశం కోసం విదేశీ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. అయితే వాళ్లలో ఎక్కువగా ఆకర్షిస్తోంది మాత్రం ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలనే. ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్‌వన్‌ టీ20 ఆటగాడైన అతను.. ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు బిగ్‌బాష్‌ లీగ్‌ గత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన మరో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ అలెక్స్‌ హేల్స్‌ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశముంది. బీబీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన ఆసీస్‌ పేసర్‌ జే రిచర్డ్‌సన్‌తో పాటు బ్యాట్‌, బంతితోనూ రాణించే కివీస్‌ ఫాస్ట్‌బౌలర్‌ జేమీసన్‌ కూడా ఈ వేలంలో మంచి ధరకు అమ్ముడుపోయి ఐపీఎల్‌ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మ్యాక్స్​వెల్

అగ్రశ్రేణి క్రికెటర్లు..

తమ జట్లు వదిలేయడంతో వేలంలోకి వస్తున్న అగ్రశ్రేణి ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు కన్నేశాయి. వాళ్లలో ముఖ్యంగా ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేయగల మ్యాక్స్‌వెల్‌పైనే అందరి దృష్టి ఉంది. పంజాబ్‌ వదులుకున్న ఈ ఆటగాడు.. ఇటీవల భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో, బిగ్‌బాష్‌లో సత్తాచాటి మంచి జోరుమీదున్నాడు. రాజస్థాన్‌తో బంధం తెంచుకున్న స్మిత్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీల మధ్య పోటీ ఉండొచ్చు. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఫించ్‌, నిషేధం నుంచి బయటపడ్డ బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌లతో పాటు ముస్తాఫిజుర్‌, మోరిస్‌, జేసన్‌ రాయ్‌, లబుషేన్‌ కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నారు. మరోవైపు హర్భజన్‌, పుజారా, విహారి, పియూష్‌, పవన్‌ నేగి, ఉమేశ్‌, దూబె లాంటి భారత ఆటగాళ్లు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

స్టీవ్​ స్మిత్​

కిరాక్‌.. కుర్రాళ్లు

ఐపీఎల్‌ వేలం జరిగిన ప్రతిసారీ అప్పటిదాకా క్రికెట్‌ అభిమానులకు పెద్దగా పరిచయం లేని దేశవాళీ యువ ఆటగాళ్లు కోట్ల ధర పలికి ఆశ్చర్యపరచడం మామూలే. కేరళ యువ బ్యాట్స్‌మన్‌ అజహరుద్దీన్‌ ఇలాగే కోటీశ్వరుడయ్యే అవకాశాలున్నాయి. ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ముంబయిపై కేవలం 37 బంతుల్లోనే శతకం బాది అతను సంచలనం సృష్టించాడు. అదే టోర్నీలో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మెరిసిన బరోడా బ్యాట్స్‌మన్‌ విష్ణు సోలంకి, నిలకడగా రాణించిన తమిళనాడు ఆటగాడు షారుఖ్‌ ఖాన్‌, బెంగాల్‌ ఓపెనర్‌ వివేక్‌ సింగ్‌తో పాటు పేసర్లు మెరివాలా (బరోడా), చేతన్‌ సకారియా (సౌరాష్ట్ర)ల కొనుగోలుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి ప్రదర్శించొచ్చు. నాగాలాండ్‌కు చెందిన 16 ఏళ్ల స్పిన్నర్‌ క్రీవిట్సో కెన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

అలెక్స్​ హేల్స్​
  1. ఈ సారి వేలంలో సచిన్‌ తనయుడు అర్జున్‌ పాల్గొంటున్నాడు. ఈ ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో సీనియర్‌ ముంబయి జట్టు తరపున ఓ మ్యాచ్‌ ఆడడంతో ఐపీఎల్‌ వేలంలో పాల్గొనే అర్హత సాధించాడు.
  2. 292 మంది ఆటగాళ్లు వేలం బరిలో నిలవనున్నారు. అందులో భారత్‌ నుంచి 164 మంది, విదేశాల నుంచి 128 మంది క్రికెటర్లు పాల్గొనబోతున్నారు. ఎనిమిది ఫ్రాంఛైజీలు కలిపి 61 మందిని మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. 22 మంది విదేశీ ఆటగాళ్లను తీసుకునే వీలుంది.
  3. రూ.2 కోట్ల కనీస ధరతో 10 మంది వేలానికి రానున్నారు. రూ.1.5 కోట్లతో 12, రూ.కోటితో 11, రూ.75 లక్షలతో 15, రూ.50 లక్షలతో 65 మంది వేలంలో పాల్గొననున్నారు.

ఇదీ చూడండి:ఐపీఎల్​ వేలం: ఈ బౌలర్లు, ఆల్​రౌండర్లపైనే దృష్టి!

ABOUT THE AUTHOR

...view details