టీ20 ప్రపంచకప్(T20 World Cup) టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన టీమ్ఇండియా, నమీబియా మ్యాచ్(IND vs Namibia) అనంతరం.. హెడ్‌కోచ్ పదవికి వీడ్కోలు పలికాడు రవిశాస్త్రి(Ravi Shastri News). మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో తన భవిష్యత్తు వ్యూహాలేమిటో చెప్పుకొచ్చాడు. మళ్లీ కామెంట్రీ చెప్పనున్నట్లు హింట్ ఇచ్చాడు.
టీమ్ఇండియా జట్టుకు హెడ్ కోచ్ కావడానికి ముందు రవిశాస్త్రి వ్యాఖ్యాతగా చేశాడు. 2011లో టీమ్ఇండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా కామెంట్రీ చేశాడు శాస్త్రి. 'ధోనీ ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్(తనదైన శైలిలో ధోనీ ఆటను ముగించాడు, టీమ్ఇండియా 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ అందుకుంది)' అని శాస్త్రి చెప్పిన మాటలు క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.
ఆ తర్వాత కోచ్ పదవి చేపట్టడం వల్ల కామెంట్రీకి దూరమయ్యాడు. ఇక ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన భారత్-ఇంగ్లాండ్ చివరి టెస్టు మ్యాచ్(IND vs ENG 5th test) వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇటీవలే పేర్కొంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ మ్యాచ్‌తో రవిశాస్త్రి వ్యాఖ్యాతగా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి.