తెలంగాణ

telangana

ETV Bharat / sports

27 ఏళ్ల నిరీక్షణకు తెర.. భారత్​పై ఇంగ్లాండ్​ విక్టరీ

ప్రపంచకప్​లో భారత్​పై ఇంగ్లాండ్​ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ సెంచరీ వృథా అయింది. 27 ఏళ్ల తర్వాత వరల్డ్​కప్​లో భారత్​పై గెలిచింది ఇంగ్లీష్​ జట్టు.

భారత్ - ఇంగ్లాండ్​

By

Published : Jun 30, 2019, 11:49 PM IST

Updated : Jul 1, 2019, 1:05 AM IST

భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్ హెలెట్స్​

ప్రపంచకప్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో టీమిండియా ఓటమిపాలైంది. టోర్నీలో మొదటి పరాజయం చవిచూసింది. 1992 ప్రపంచకప్​ తర్వాత మెగాటోర్నీలో భారత్​పై విజయం సాధించడం ఇంగ్లాండ్​కు ఇదే తొలిసారి.

338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ప్రారంభంలోనే రాహుల్ వికెట్ కోల్పోయింది. పరుగులేమీ చేయకుండానే వోక్స్ బౌలింగ్​లో వెనుదిరిగాడు రాహుల్. అనంతరం రోహిత్​, కోహ్లీలు సమయోచితంగా ఆడుతూ పరుగులు సాధించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ దశలోనే ఇరువురు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్​కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక ప్లంకెట్ బౌలింగ్​లో కోహ్లీ పెవిలియన్ చేరాడు.

రోహిత్ శతకం వృథా

ఈ ప్రపంచకప్​లో ఇప్పటికే రెండు శతకాలు చేసిన రోహిత్.. మరోసారి తన క్లాస్ ఇన్నింగ్స్​తో సెంచరీ సాధించాడు. మొదట నెమ్మదిగా ఆడిన హిట్​మ్యాన్ అర్ధసెంచరీ తర్వాత కాస్త జోరు పెంచాడు. ప్లంకెట్ వేసిన ఓ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్​లో రోహిత్ సెంచరీ సాధించినా.. ఇందులో ఒక్క సిక్సూ లేకపోవడం విశేషం. సెంచరీ సాధించిన వెంటనే భారీ షాట్​కు ప్రయత్నంచి హిట్​మ్యాన్ పెవిలియన్ చేరాడు.
అనంతరం పంత్ (32) కాసేపు క్రీజులో నిలిచాడు. మిడిలార్డర్​లో వచ్చిన పాండ్య 33 బంతుల్లో 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో ధోనీ 31 బంతుల్లో 42 పోరాడినా ఫలితం లేకపోయింది. భారత్ 31 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.

ఇంగ్లాండ్​ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​తో ఆకట్టుకున్నారు. ప్లంకెట్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వోక్స్​ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

ఇంగ్లాండ్ పరుగుల వరద

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్​కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్నిచ్చారు. రాయ్, బెయిర్​స్టో ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డారు. రాయ్ 57 బంతుల్లో 66 పరుగులు చేసి ఔటవ్వగా.. బెయిర్​స్టో సెంచరీతో మెరిశాడు. 109 బంతుల్లో 6 సిక్సులు, 10 ఫోర్లతో 111 పరుగులు చేశాడు. వీరిద్దరి దూకుడుకు భారత బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. రూట్​ 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. మోర్గాన్ (1), బట్లర్ (20) విఫలమైనా.. స్టోక్స్ మిడిలార్డర్​లో సత్తాచాటాడు. 54 బంతుల్లోనే 3 సిక్సులు, 6 ఫోర్లతో 79 పరుగులు చేశాడు. ఫలితంగా ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది.

భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లతో విజృంభించగా.. బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఇవీ చూడండి.. చాహల్ ఖాతాలో చెత్త రికార్డు..

Last Updated : Jul 1, 2019, 1:05 AM IST

ABOUT THE AUTHOR

...view details