ఇటీవలే జరిగిన క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ గుర్తుందా! బుమ్రా వేసిన బంతి ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్‌కు తగిలి వికెట్లను తాకింది. అయితే బెయిల్స్ కిందపడకపోవడం వల్ల వార్నర్ నాటౌట్‌గా నిలిచాడు. ఈ విషయంలో ఐసీసీ నిబంధనలపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని సచిన్ లేవనెత్తాడు. మీరు అంపైర్ అయితే ఏం చేస్తారు అంటూ క్రికెట్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
వీడియోలో ఏముంది..?
బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్‌మన్ ఆడేందుకు ప్రయత్నించగా అది వికెట్లను తాకుతుంది. అయితే పైకి లేచిన బెయిల్ కిందపడకుండా ఓ స్టంప్‌పై అలాగే ఉండిపోయింది. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో మీరే అంపైర్ అయితే ఏం చేస్తారని ట్వీట్ చేశాడు సచిన్. నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
ఐసీసీ నిబంధన ఏంటి..?
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నియమాల చట్టం సెక్షన్ 29.1.1 ప్రకారం బంతి వికెట్లను తాకినపుడు స్టంప్స్‌పై నుంచి బెయిల్స్ పూర్తిగా వేరు పడాలి లేదా స్టంప్ కిందపడాలి. ఇలా జరిగినపుడే బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గా పరిగణిస్తారు.
బెయిల్స్ కిందపడకపోవడం వల్ల చాలాసార్లు బ్యాట్స్‌మన్ నాటౌట్‌గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రపంచకప్‌లోనే ఈ విధంగా ఆరు సార్లు జరిగింది.
- బుమ్రా(భారత్)- డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)
- రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) - డికాక్ (దక్షిణాఫ్రికా), ఓవల్
- ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) - కరుణరత్నే(శ్రీలంక), కార్డిఫ్
- మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)- క్రిస్ గేల్(విండీస్), నాటింగ్‌హామ్
- బెన్ స్టోక్స్(ఇంగ్లాండ్) - డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా), ఓవల్
బెయిల్స్‌ను బంతి స్పష్టంగా తాకిందో లేదో తెలుసుకునేందుకు, రనౌట్లు, స్టంపౌట్లను పారదర్శకంగా నిర్ధరించేందుకు ఎల్ఈడీ స్టంప్‌లను తీసుకొచ్చింది ఐసీసీ. 2014 టీ 20 వరల్డ్‌కప్‌లో తొలిసారి వీటిని ఉపయోగించారు. బంతి తాకగానే ఇవి వెలుగుతూ కనిపిస్తాయి.
ఇది చదవండి: 'నిరాశ చెందా.. భవిష్యత్తులో జట్టులోకి వస్తా'