తెలంగాణ

telangana

ETV Bharat / sports

మూడు రోజుల్లోనే ముగింపు.. అగ్రస్థానం మరింత పదిలం​ - ఇండియా VSబంగ్లాదేశ్​

ఇండోర్​ వేదికగా భారత్-బంగ్లాదేశ్​​ మధ్య జరిగిన తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. టీమిండియా పేసర్ల ధాటికి బంగ్లా ఆటగాళ్లు క్యూ కట్టేశారు. ఫలితంగా ఇన్నింగ్స్​ 130 పరుగుల తేడాతో గెలిచింది కోహ్లీసేన. ఇప్పటికే టెస్టు ఛాంపియన్​షిప్​లో తొలి స్థానంలో ఉన్న భారత్.. మరో 60 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.

బౌలర్ల విజృంభణ.. టీమిండియా ఘన విజయం

By

Published : Nov 16, 2019, 3:51 PM IST

Updated : Nov 16, 2019, 5:23 PM IST

ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టెస్టులో.. ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది టీమిండియా. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది కోహ్లీసేన. మూడో రోజైన శనివారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ 69.2 ఓవర్లకు 213 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్ల హవా...

భారత బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. 16 ఓవర్ల బౌలింగ్​లో 7 మెయిడిన్లు సాధించాడీ బౌలర్. ఇతడికి తోడు రవిచంద్రన్ అశ్విన్ మూడు, ఉమేశ్ యాదవ్ రెండు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

మయాంక్​ మరోమారు..

ఇండోర్ వేదికగా గురువారం(నవంబర్​ 14న) ప్రారంభమైన మొదటి టెస్టులో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్​ చేసిన భారత జట్టులో ఓపెనర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ డ‌బుల్ సెంచ‌రీ(243) సాధించాడు.మూడు టెస్టుల వ్యవధిలో రెండు ద్విశతాలు బాదేశాడీ కర్ణాటక ప్లేయర్​. రహానే(86) సహా జడేజా, పుజారా చెరో అర్ధశతకంతో రాణించారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది. అదే స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది కోహ్లీసేన.

ఆరంభమే ఫేలవంగా...

రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన బంగ్లా జట్టు.. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఆరో ఓవర్‌లో ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఇమ్రుల్‌ (6) బౌల్డయ్యాడు. ఆ త‌ర్వాత ఇషాంత్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ షాద్‌మాన్ ఇస్లామ్‌(6) పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన మొమినుల్‌ హక్‌(7), మిథున్‌(18)లు వెంటవెంటనే ఔటయ్యారు.

ముష్ఫికర్ ఒంటరి పోరాటం

నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లా జట్టును.. బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశాడు ముష్ఫికర్​ రహీమ్​. ఈ క్రమంలో భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని... కెరీర్​లో మరో అర్ధశతకం సాధించాడు. అతడికిది 20వ హాఫ్ సెంచరీ.

- టెస్టుల్లో భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన బంగ్లాదేశ్‌ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ముష్ఫికర్​ రహీమ్​. ఇప్పటి వరకు మహ్మద్‌ అష్రాఫుల్‌(386 పరుగులు) పేరిట ఉన్న రికార్డును అతడు బ్రేక్​ చేసి మూడో స్థానం కైవసం చేసుకున్నాడు. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్‌ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

-ఇరుజట్ల పరంగా చూస్తే సచిన్‌ తెందూల్కర్‌(820) అగ్రస్థానంలో ఉండగా... రాహుల్‌ ద్రవిడ్‌(560) రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న ముష్ఫికర్ సగటు 55 ఉండటం విశేషం. భారత్‌తో ఇప్పటివరకు ఐదు టెస్టులు ఆడిన ముష్పికర్‌.. మొత్తం తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు సాధించాడు.

10వ విజయం...

ముష్ఫికర్ ఔటైన తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్లు క్యూ కట్టేశారు. ఫలితంగా బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే పరిమితమైంది. ఇన్నింగ్స్​ 130 పరుగుల తేడాతో గెలిచిన కోహ్లీ సేన.. 10వ ఇన్నింగ్స్ విజయం ఖాతాలో వేసుకుంది.

స్కోరు వివరాలు:

బంగ్లా తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 493/6 డిక్లేర్డ్
బంగ్లా రెండో ఇన్నింగ్స్: 213 ఆలౌట్

ఇవీ చూడండి.. 'వదిలాడు... ప్రాక్టీస్​ చేసి పట్టాడు..'

Last Updated : Nov 16, 2019, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details