తెలంగాణ

telangana

By

Published : Jun 13, 2020, 7:41 AM IST

ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​పై చిగురిస్తున్న ఆశలు

కరోనా ప్రభావంతో టీ20 ప్రపంచకప్​ నిర్వహించడం అసాధ్యమేనని అనుకున్నారు. కానీ ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల వల్ల టోర్నీ జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

T 20
టీ 20

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబరు-నవంబరు మధ్య టీ20 ప్రపంచకప్‌ జరగడం దాదాపు అసాధ్యం అనే అభిప్రాయానికి వచ్చేశారంతా! అదే సమయంలో ఐపీఎల్‌ జరుగుతుందన్న ప్రచారమూ గట్టిగా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విమాన ప్రయాణాలపై ఆంక్షలుండటం, సమీప భవిష్యత్తులో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు కనిపించకపోవడం వల్ల పొట్టి కప్పును వాయిదా వేయక తప్పని అనివార్యత కనిపించింది. కానీ ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయి.

విమాన ప్రయాణాలపై ఆంక్షలు తగ్గుతున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియాలో స్టేడియాల్లోకి జులై నుంచే ప్రేక్షకుల్ని అనుమతించబోతుండటం విశేషం. దేశంలో కరోనా ఆంక్షలను నెమ్మదిగా సడలిస్తున్న ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌.. క్రీడలకు మరిన్ని మినహాయింపులివ్వాలని నిర్ణయించారు. నాలుగో వంతు సామర్థ్యంతో స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు అనుమతులిచ్చారు. అంటే 40 వేల సామర్థ్యం ఉన్న స్టేడియంలోకి 10 వేల మందిని అనుమతిస్తారన్నమాట.

టీ20 ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీని ఖాళీ స్టేడియాల్లో నిర్వహించడం బాగుండదన్న ఉద్దేశంతోనే దీనిని వాయిదా వేయాలన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి. కానీ ఇప్పుడా సమస్య లేదు. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌-వెస్టిండీస్ టెస్టు‌ సిరీస్‌ మొదలు కానుంది. టీ20 ప్రపంచకప్‌ సమయానికి పరిస్థితులు మామూలుగా అయిపోవచ్చు. అప్పటికి పూర్తిస్థాయిలో ప్రేక్షకుల్ని స్టేడియాల్లోకి అనుమతించే అవకాశాలనూ కొట్టిపారేయలేం. కాబట్టి 2020లో టీ20 ప్రపంచకప్‌ కథ ముగిసిందనుకోవడానికి లేదు.

ఇది చూడండి : శిల్పాశెట్టిని చూసి నవ్వు ఆపుకోలేకపోయిన వార్నర్​!

ABOUT THE AUTHOR

...view details