ముంబయి ఇండియన్స్.. ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు విజేతగా నిలిచిన ఒకే ఒక జట్టు. రోహిత్ శర్మ సారథ్యంలో తనదైన ఆటతీరుతో విజయవంతమైన ఫ్రాంచైజీగా వెలుగొందుతోంది. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తుదిపోరులో గెలిచి నాలుగో సారి టైటిల్ గెలుచుకుంది. ఈసారి కూడా సత్తాచాటేందుకు సిద్ధమవుతోంది. కరోనా కారణంగా యూఏఈలో జరుగుతోన్న ఈ టోర్నీలోనూ గెలిచి ఐదోసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని అనుకుంటోంది. ఈ సీజన్లో కూడా రోహిత్ సేన టైటిల్ ఫేవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈసారి ఈ జట్టు బలాలు, బలహీనతలు వంటి విషయాలపై ఓ లుక్కేద్దాం.
బలాలు
బలమైన టాపార్డర్
ముంబయి జట్టు టాపార్డర్ విషయంలో బలంగా ఉంది. ఈసారి వేలంలో క్రిస్ లిన్‌ను దక్కించుకుని మరింత దృఢంగా తయారైంది. ఇంతకుముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడిన ఈ ఆటగాడు ఈసారి క్వింటన్ డికాక్‌తో కలిసి ముంబయికి ఓపెనర్‌గా దిగే అవకాశం ఉంది. లిన్-డికాక్ ఇద్దరికీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మంచి రికార్డుంది. వీరి తర్వాత సారథి రోహిత్ శర్మ మూడో స్థానంలో బరిలో దిగొచ్చు. అలాగే నెంబర్ 4 కోసం యువ ఆటగాళ్లు సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు ఉన్నారు.
భారత ఆటగాళ్లే బలం
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య లాంటి భారత స్టార్ ఆటగాళ్లతో ముంబయి బలంగా ఉంది. అలాగే కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్ కూడా టీ20ల్లో సత్తా చాటగలరు. రవీంద్ర జడేజా, చాహల్ వల్ల వీరికి టీమ్ఇండియాలో చోటు తరచుగా లభించకపోయినా.. చాహర్, కృనాల్ మంచి ప్రతిభ గల స్పిన్నర్లు. అలాగే సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ ఇషాన్‌కు ఈ లీగ్‌లో మంచి అనుభవం ఉంది.
అద్భుత ఆల్‌రౌండర్ విభాగం
టీ20ల్లో విజయవంతమైన జట్టుగా నిలవాలంటే ఆల్‌రౌండర్లు కీలకం. అపుడే జట్టు సమతుల్యంగా ఉంటుంది. ముంబయిలోనూ పాండ్య సోదరులతో పాటు కీరన్ పొలార్డ్ వంటి అనుభవమున్న ఆల్‌రౌండర్ ఉన్నాడు. వీరు బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాక ఫీల్డింగ్‌లోనూ సత్తాచాటగలరు. అలాగే ఈసారి వేలంలో ముంబయి ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసిన నాథన్ కల్టర్నీల్తో పాటు విండీస్‌కు చెందిన రూథర్‌ఫోర్డ్ బ్యాకప్ ఆల్రౌండర్లుగా ఉండనున్నారు.
బలహీనతలు
స్పిన్ దళం
ముంబయి ఇండియన్స్‌లో భారత పిచ్‌లపై సత్తాచాటగలిగే స్పిన్నర్లు ఉన్నప్పటికీ.. యూఏఈలో పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉంటాయి. అక్కడ రాణించాలంలే కాస్త అనుభవం ఉన్న స్పిన్నర్లు కావాలి. రాహుల్ చాహర్, కృనాల్ పాండ్య రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నా వారు అక్కడి పిచ్‌లపై ఎలా ఆడతారన్నది ప్రశ్న. వీరిద్దరు కూడా వికెట్లు తీయడం కంటే పరుగులను కట్టడి చేయడంలోనే ఎక్కువగా సఫలమవుతున్నారు. అందువల్ల ఈ విభాగంలో ముంబయి అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు.
పేస్ దళం (ఎక్కువగా బుమ్రాపై ఆధారపడటం)
ట్రెంట్ బౌల్ట్.. రూపంలో అనుభవమున్న పేసర్ ఉన్నా ఇతడు ఈ ఫార్మాట్లో 8కిపైగా ఎకానమీతో పరుగులు ఇస్తున్నాడు. గత సీజన్లో బౌల్ట్‌కు 5 మ్యాచ్‌ల్లో మాత్రమే అవకాశం దక్కింది. కొత్తగా వేలంలో కొనుగోలు చేసిన నాథన్ కల్టర్నీల్ గత రెండు సీజన్ల నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ధావల్ కులకర్ణి రూపంలో మరో భారత బౌలర్ ఉన్నా.. మూడు సీజన్లుగా 9కిపైగా ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్లు సాధించడంలోనూ విఫలమవుతున్నాడు. ఈ లీగ్‌లో ఎంతో అనుభవమున్న లంక పేసర్ లసిత్ మలింగ ఈ సీజన్కకు వ్యక్తిగత కారణాలతో దూరమవడం ముంబయికి గట్టి దెబ్బ. ఇతడి స్థానంలో ఆసీస్‌కు చెందిన ప్యాటిన్సన్ను తీసుకున్నా అతడు టీ20 ఫార్మాట్లో ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. ఇక పేస్ బాధ్యత అంతా టీమ్ఇండియా స్టార్ బౌలర్ బుమ్రాపైనే. గాయం కారణంగా జట్టుకు దూరమవడం, కరోనా కారణంగా విరామం రావడం వల్ల బుమ్రా చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో ఇతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది తెలియాలి.
టై-2 ఆటగాళ్లు
ఇప్పటికే టీమ్ఇండియా జట్టులో చోటు దక్కించుకున్న వారిలో రాహుల్ చాహల్, కృనాల్ పాండ్య ఉన్నారు. వచ్చే రెండేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు ఉండటం వల్ల వీరిద్దరూ ఎలాగైనా ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనబరిచి మెగాటోర్నీ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్నారు.
సూర్య కుమార్ యాదవ్.. అస్థిరమైన ప్రదర్శనతో ఇప్పటివరకు ఇతడు టీమ్ఇండియాకు ఆడలేకపోయాడు. ప్రస్తుతం భారత్‌కు మిడిలార్డర్ సమస్య వెంటాడుతోంది. దీంతో ఇతడు ఈ లీగ్‌లో సత్తాచాటితే ఆ స్థానంలో సూర్యను పరిశీలించవచ్చు.
అనుకూల్ రాయ్.. 2018లో జరిగిన అండర్19 ప్రంపచకప్‌లో సత్తాచాటి భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించాడు. ఈసారి లీగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి భారత జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్నాడు.
ఇషాన్ కిషన్.. గత సీజన్లో 7 మ్యాచ్‌ల్లో 101 పరుగులు చేశాడు. ఇతడు కూడా భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. కాకపోతే రిషబ్ పంత్‌తో కిషన్‌కు పోటీ ఉంది. ఈ లీగ్‌లో సత్తాచాటి పంత్ కంటే ముందడుగు వేయాలని ఇతడు భావిస్తున్నాడు.
ప్రమాదాలు
యూఏఈలో పేలవమైన రికార్డు
2014లో దేశంలో ఎన్నికల కారణంగా ఆ ఏడాది ఐపీఎల్ ప్రారంభమ్యాచ్లు యూఏఈలో జరిగాయి. కానీ అక్కడ పేలవమైన ప్రదర్శనతో నిరుత్సాహ పరిచింది ముంబయి. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. అక్కడ జట్టు ఎందుకు విఫలమైందో స్పష్టత లేకపోయినా.. ఈసారి ఆ తప్పులు జరగకుండా చూసుకోవడంపైనే రోహిత్ సేన టైటిల్ వేట ఆధారపడి ఉంది.
రిజర్వ్ ఆటగాళ్ల సత్తాపై అనుమానాలు
ఈ సీజన్లో ప్రతి ఆటగాడు అన్ని లీగ్ మ్యాచ్‌లు ఆడటం కష్టమే. అక్కడ హీట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆటగాళ్లపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా పేస్ బౌలర్లు ప్రమాదానికి గురి కావచ్చు. అందువల్ల ప్రధాన పేసర్లకు తోడు రిజర్వ్ ఆటగాళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ మోహ్సిన్ ఖాన్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, దిగ్విజయ్ దేశ్‌ముఖ్, అన్మోల్ ప్రీత్ సింగ్ వంటి వారు లీగ్‌లో ఎలా రాణిస్తారన్నది ప్రశ్నే. అలాగే సౌరభ్ తివారీ, ఆదిత్యా తారేలకు కూడా రెగ్యులర్‌గా అవకాశాలు రావడం లేదు.
ఐదోసారి కొడుతుందా!
ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచి విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. మూడు టైటిల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. ఈసారి కూడా గెలిచి ఐదో సారి విజేతగా నిలవాలని అనుకుంటోంది రోహిత్ సేన.