క్రికెట్లో టెస్టు హోదా పొందిన టాప్-10 జట్లలో ఇప్పటివరకు డే/నైట్ టెస్టు ఆడనివి భారత్, బంగ్లాదేశ్ మాత్రమే. నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైన ఈ మ్యాచ్‌ల్ని అన్ని దేశాలు ఆడేశాయి. తాజాగా భారత్‌కు ఆ ఘనతను అందించేందుకు ముందడుగు వేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.
కొత్త అడుగు...
ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దాదా... గులాబి బంతితో టెస్టు కోసం భారత కెప్టెన్ కోహ్లీని, బంగ్లా క్రికెట్ బోర్డును ఒప్పించాడు. భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్... ముందుగా ఒప్పందం చేసుకోకపోయినా, అనూహ్యంగా దాదా నిర్ణయానికి ఒప్పుకోవడం చర్చనీయాంశమైంది.ఈ టెస్టు కోసం ఘనంగా ఏర్పాట్లు చేసిన భారత క్రికెట్ బోర్డు.. నూతన అధ్యయానికి ఘనంగా స్వాగతం పలుకుతోంది. అయితే ఫ్లడ్‌లైట్ల వెలుగులో పింక్‌బాల్ కనిపించదని కొందరు.. అలవాటు పడితే కష్టమేమీ కాదని మరికొందరు వాదిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో తొలి డే/నైట్ టెస్టుకు 'సిటీ ఆఫ్ జాయ్'గా పిలుచుకునే కోల్‌కతా సిద్ధమైంది.
12వ టెస్టు సిరీస్...
సొంతగడ్డపై టెస్టుల్లో జైత్రయాత్ర సాగిస్తున్న కోహ్లీసేన... ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే 11 టెస్టు సిరీస్‌లను ఖాతాలో వేసుకుంది భారత్. ఈ మ్యాచ్ గెలిస్తే వరుసగా మూడో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుంది.
ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌ల్లో వెస్టిండీస్(2 మ్యాచ్‌లు), దక్షిణాఫ్రికా(3 మ్యాచ్‌లు)పై గెలిచి రెండు సిరీస్‌లు క్లీన్‌స్వీప్ చేసింది కోహ్లీసేన. ఇప్పటికే బంగ్లాపై రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ ఉంది.
పదునైన అస్త్రాలు...
భారత బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ ఓపెనర్‌గా రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. కెప్టెన్ కోహ్లీ, టెస్టు స్పెషలిస్టులు పుజారా, రహానేలతో భారత్ బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది.
బౌలింగ్ దళంలో పేసర్లు ఇషాంత్‌శర్మ, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్.. గత టెస్టులో సత్తా చాటారు. ముగ్గురూ కలిసి 14 వికెట్లు పడగొట్టారు. వీరంతా రాణిస్తే బంతి రంగు అనేది పెద్ద విషయం కాదని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
మ్యాచ్‌లో లంచ్ తర్వాతి సెషన్ కీలకంగా ఉండనుంది. చివరి సెషన్‌లో స్వింగ్, రివర్స్‌స్వింగ్ రాబట్టేందుకు బౌలర్లు మరింత శ్రమించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
గులాబి బంతి స్పిన్నర్లకు సహకరించదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో స్పిన్నర్ల నుంచి అంతగా ప్రదర్శన ఆశించలేమని ఇప్పటికే పలువురు మాజీలు స్పష్టం చేశారు. భారత ఆటగాళ్లలో చాలా మందికి దులీప్ ట్రోఫీలో గులాబీ బంతితో డే/నైట్‌మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.