తెలంగాణ

telangana

ETV Bharat / sports

సఫారీలకు షాక్​- బంగ్లాదేశ్​ అనూహ్య గెలుపు

ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో బంగ్లాదేశ్ అనూహ్య విజయం సాధించింది. సమష్టిగా రాణించి టోర్నీని ఘనంగా ఆరంభించింది బంగ్లాదేశ్​. 21 పరుగుల తేడాతో గెలుపొంది.. 2011 ప్రపంచకప్​ టోర్నీలో సఫారీల చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

బంగ్లా

By

Published : Jun 2, 2019, 11:24 PM IST

Updated : Jun 2, 2019, 11:58 PM IST

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. సమష్టిగా రాణించిన బంగ్లా ప్రపంచకప్​ను ఘనంగా ప్రారంభించింది. మొదట బంగ్లా బ్యాట్స్​మెన్ సత్తాచాటి జట్టుకు 330 పరుగుల భారీ స్కోర్ అందించారు. అనంతరం బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​తో మ్యాచ్​ను దక్షిణాఫ్రికాకు దూరం చేశారు.

331 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టులో డికాక్ (23) పరుగులు చేసి ఔటవగా.. మరో ఓపెనర్ మర్కరమ్ (45) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సారథి డుప్లెసిస్ మిల్లర్​తో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిల్లర్ ముస్తఫిజుర్ బౌలింగ్​లో ఔటయ్యాడు. బాధ్యతగా ఆడిన డుప్లెసిస్ 53 బంతుల్లో 62 పరుగులు చేసి మెహదీ హసన్ బౌలింగ్​లో బౌల్డయ్యాడు.

మిడిలార్డర్​లో డసేన్​ (41), డుమిని (45) పోరాడినా ఫలితం లేకపోయింది. బంగ్లా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి సఫారీ జట్టుపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులకే పరిమితమైంది.

బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మాన్ 3 వికెట్లు దక్కించుకోగా, సైఫుద్దీన్ 2, షకిబుల్ హసన్ ఓ వికెట్ తీశారు. షకిబుల్​ హసన్​కు మ్యాన్​ ఆఫ్​ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

బంగ్లా అదుర్స్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాకు శుభారంభం లభించింది. మొదటి వికెట్​కు 60 పరుగులు జోడించాక తమీమ్ ఇక్బాల్ (16) ఔటయ్యాడు. మరో ఓపెనర్ సౌమ్యా సర్కార్ 42 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం షకిబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్​తో అలరించారు. ఇరువురు అర్ధసెంచరీలు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. మూడో వికెట్​కు బంగ్లా తరఫున 142 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

చివర్లో మహ్మదుల్లా (46), మిథున్ (21), మొసడెక్ హసన్ (26) ఫర్వాలేదనిపించగా బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోరు చేసింది. వన్డేల్లో బంగ్లాకు ఇదే అత్యుత్తమ స్కోర్ కావడం విశేషం.

స్కోర్​ కార్డ్

సఫారీ బౌలర్లలో తాహిర్, మోరిస్, ఫెహ్లుక్వాయో చెరో 2 వికెట్లు తీసుకున్నారు. టోర్నీలో దక్షిణాఫ్రికా వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మొదటి మ్యాచ్​లో ఇంగ్లాండ్​ చేతిలో పరాజయం పొందింది సఫారీ జట్టు.

ప్రతీకారం...

2011 ప్రపంచకప్​ టోర్నీలో బంగ్లాదేశ్​పై సఫారీ జట్టు 206 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​ గెలుపుతో దక్షిణాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకుంది బంగ్లాదేశ్.

ఇవీ చూడండి,.. సఫారీలతో మ్యాచ్​లో బంగ్లాదేశ్​ రికార్డులు

Last Updated : Jun 2, 2019, 11:58 PM IST

ABOUT THE AUTHOR

...view details