ఇంగ్లాండ్ గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ సొంతం చేసుకుని 18ఏళ్లు దాటింది. మాజీ సారథులు రికీ పాంటింగ్ వశం కాలేదు.. క్లార్క్ దరిచేరలేకపోయాడు.. ఆసీస్ దిగ్గజ సారథులుగా పేరు తెచ్చుకున్న వీరి వల్ల కాని ఈ ఘనతకు అనుకోకుండా కెప్టెన్ అయిన టిమ్ పైన్ అడుగు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న కంగారూ జట్టు.. చివరి టెస్టు డ్రా చేసుకున్నా సిరీస్ దక్కించుకుంటుంది.
ఇంగ్లాండ్‌లో చివరగా స్టీవ్ వా సారథ్యంలో 4-1 తేడాతో యాషెస్ సిరీస్ కైవసం చేసుకుంది ఆసీస్. అంతకుముందు గ్రేగ్ చాపెల్ మాదిరిగానే స్టీవ్‌వా తర్వాత పాంటింగ్, క్లార్క్ చెరో రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్‌తో కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్ ఏడాది నిషేధానికి గురయ్యారు. ఈ కారణంగా టిమ్ పైన్‌ను సారథిగా నియమించింది ఆసీస్ క్రికెట్ బోర్డు. సాధారణంగా జాతీయ జట్టుకు అత్యుత్తమమైన 11 మంది క్రికెటర్లను ఎంపిక చేస్తుంది ఆస్ట్రేలియా. వారిలో నెంబర్ వన్‌గా ఉన్న ఆటగాడిని కెప్టెన్‌గా నియమిస్తుంది. ఈ సంప్రదాయానికి భిన్నంగా పైన్‌కు అనుకోకుండా బాధ్యతలు అప్పగించింది.