తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆఖరి టీ-20 ఇండియాదే.. సిరీస్​ క్లీన్​స్వీప్​ - పంత్​

వెస్టిండీస్​తో 3 మ్యాచ్​ల టీ-20 సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేసింది టీమిండియా. మంగళవారం గయానా వేదికగా జరిగిన చివరి మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్​ 3-0తో సిరీస్​ సొంతం చేసుకుంది. దీపక్​ చాహర్​కు మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​, కృనాల్​ పాండ్యకు ప్లేయర్​ ఆఫ్​ ద సిరీస్​ అవార్డు దక్కింది.

ఆఖరి టీ-20 ఇండియాదే.. సిరీస్​ క్లీన్​స్వీప్​

By

Published : Aug 7, 2019, 5:25 AM IST

ఆఖరి టీ-20లోనూ వెస్టిండీస్​కు నిరాశే ఎదురైంది. 3 మ్యాచ్​ల టీ-20 సిరీస్​ను భారత్​ క్లీన్​స్వీప్​ చేసింది. మంగళవారం గయానా వేదికగా జరిగిన మ్యాచ్​లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వెస్టిండీస్​ నిర్దేశించిన 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించింది కోహ్లీ సేన. రిషభ్​ పంత్​(65 నాటౌట్​; 42 బంతుల్లో​), విరాట్​ కోహ్లీ(52; 45 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు. దీపక్​ చాహర్​కు మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు లభించింది. సిరీస్​ మొత్తం ఆల్​రౌండ్​ ప్రతిభ కనబర్చిన కృనాల్​ పాండ్యకు ప్లేయర్​ ఆఫ్​ ద సిరీస్​ దక్కింది.

పొలార్డ్​ ఒక్కడే...

తొలుత బ్యాటింగ్​ చేసిన వెస్టిండీస్​ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 146 పరుగులు చేసింది. తొలుత 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కరేబియన్​ జట్టును పొలార్డ్(58; 45 బంతుల్లో) ఆదుకున్నాడు. నాలుగో వికెట్​కు పూరన్​తో కలిసి 66 పరుగులు జోడించి.. ఐదో వికెట్​గా వెనుదిరిగాడు. చివర్లో పావెల్​(20 బంతుల్లో 32) మెరుపులు మెరిపించగా ఆ మాత్రం స్కోరైనా సాధించింది.

భారత బౌలర్లలో దీపక్​ చాహర్​ 3, సైనీ 2 వికెట్లు తీశారు. రాహుల్​ చాహర్​కు ఓ వికెట్ దక్కింది.

ఛేదనలో అలవోకగా...

స్వల్ప లక్ష్యఛేదనలో ఆరంభంలోనే భారత్​ ధావన్​(3) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్​ రాహుల్​ 20 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం.. భారత సారథి కోహ్లీ.. యువ ఆటగాడు పంత్​తో కలిసి విజయం దిశగా తీసుకెళ్లాడు. అడపాదడపా బౌండరీలు సాధించిన వీరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు.

గెలుపునకు 14 పరుగుల దూరంలో విరాట్​ అవుటవ్వగా.. మనీష్​ పాండే(2 నాటౌట్​) తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు పంత్​. విండీస్​ బౌలర్​ థామస్​ 2 వికెట్లు తీశాడు.

ABOUT THE AUTHOR

...view details