అనుకోని కారణాలతో 2021లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్ నిర్వహించేందుకు వీలవ్వకపోతే శ్రీలంక, యూఏఈ దేశాలను బ్యాకప్ వేదికలుగా నిర్ణయించారు. ఐసీసీలో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. ఏ మెగాటోర్నీకైనా ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించడం ఆనవాయితీ.
ఆస్ట్రేలియా 2020, భారత్ 2021లో టీ20 ప్రపంచకప్‌లను నిర్వహించాల్సి ఉంది. కరోనా ప్రభావంతో 16 జట్లతో మెగాటోర్నీ ఆతిథ్యం సాధ్యంకాదని ఆస్ట్రేలియా దీనిని వాయిదా వేసింది. ఐసీసీలో సభ్య దేశాలు చర్చించి దీనిని 2022లో నిర్వహించాలని నిర్ణయించాయి. భవిష్య ప్రణాళిక పర్యటన ప్రకారం భారత్‌లో యాథావిధిగా 2021లోనే టోర్నీ జరగనుంది. ఈ వైరస్ వల్ల పరిస్థితులు అనుకూలంగా లేకపోతే యూఏఈ, శ్రీలంకను ప్రత్యామ్నాయ వేదికలుగా ఎంపిక చేశారు. ‘ఐసీసీ ప్రతి టోర్నీకి ప్రత్యామ్నాయ వేదికల ఎంపిక చేయడం ఆనవాయితీయే. కరోనా వైరస్ మహమ్మారి వల్ల దీనికిప్పుడు ఎక్కువ ప్రాధాన్యం లభించింది’ అని ఆయా వర్గాలు అంటున్నాయి.