AUS vs SL T20: సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో కంగారూలు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఐదు టీ20 మ్యాచుల్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఆసీస్ జట్టు విజయం సాధించింది. మరోవైపు వరుస పరాజయాలను మూటగట్టుకున్న శ్రీలంక ఆఖరి మ్యాచ్‌లో గెలుపొంది వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది. రెండో టీ20 మినహా సిరీస్ మొత్తంలో దసున్ శనకా సేన కంగారూలకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్‌మాక్స్‌వెల్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును అందుకున్నాడు.
సిడ్నీ వేదికగా ఈనెల 11న జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక 20 ఓవర్లు ముగిసే నాటికి కంగారూలను 149 పరుగులకు కట్టడి చేసింది. డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో శ్రీలంక చేయాల్సినవి 143 పరుగులు కాగా 122 పరుగులకే ఆసీస్ వారికి కట్టడి చేసి తొలి మ్యాచ్ బోణి కొట్టేసింది. ఆ తర్వాత 13న జరిగిన రెండో టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. శ్రీలంక చేసిన స్కోరును ఆసీస్ సమం చేసింది. ఈ క్రమంలో నిర్వహించిన సూపర్ ఓవర్లో ఆస్ట్రేలియా పుంజుకుని విజయం సాధించింది.